మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక ప్రకటన చేశారు. అన్నదాతలకు శుభవార్త అందిస్తూ రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.‘మహాత్మా జ్యోతి బా పూలే రైతు రుణ మాఫీ’గా ఈ పథకానికి పేరు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు సీఎం ఉద్దవ్‌ థాక్రే శనివారం (డిసెంబర్ 21) మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రకటన చేశారు.

 

పంట రుణాలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయనున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. 2020 మార్చిలో ఈ కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు. 2019 సెప్టెంబర్ 30 వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు.

 

అయితే.. ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలను మొత్తం మాఫీ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. శివసేన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా బీజేపీ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మొత్తం రుణాలు మాఫీ చేయడం కుదరదనీ.. ప్రభుత్వం పై భారీగా ఒత్తిడి పడుతుందని సీఎం ఉద్ధవ్ థాక్రే వివరించారు. రూ. 2 లక్షల వరకే రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. 

 

తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. గడువు ముగుస్తున్నా.. ఈ నిధులను ఇంతవరకూ విడుదల చేయకపోవడం రైతుల్లో అసహనానికి గురి చేస్తోంది. మరోవైపు బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్నికల్లో గెలిచిన తరువాత రైతుల రుణ మాఫీ చేస్తామని సీఎం కమల్‌నాథ్ ప్రకటించారు కానీ అది కూడా ఇంతవరకు పూర్తిగా అమలు కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: