భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ టౌన్, సుగుణ గార్డెన్స్ నందు రెండవ విడత గ్రామ బాట అవగాహన సదస్సు, ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.TRS లోక్ సభపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు ప్రయాణికుల తో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

 

ప్రతి డిపో నుంచి సరుకు రవాణా కోసం కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ మొదలు పెట్టేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ప్రతి బస్సు నిండుగా ప్రయాణికులతో ఉండే విధంగా ఆక్యుపెన్సి రేషియో (ఓఆర్) పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. సంస్థ లాభాల్లోకి తీసుకురావడమే తమ ముందున్న కర్తవ్యమని అన్నారు.

 

‘‘కార్గో అనేది ముఖ్యమంత్రి ఆలోచన. పౌర సరఫరాల్లో బియ్యం రవాణా ఖర్చు మొత్తం ప్రస్తుతం ప్రైవేటు సంస్థలకు పోతోంది. ప్రయాణానికి అనువుగా లేని వాటిని, కార్గో బస్సులుగా తయారు చేస్తున్నాం. వీటికి ప్రత్యేకమైన రంగు వేసి సీఎం బొమ్మ వేస్తున్నాం. ప్రాథమికంగా 800 బస్సులను తయారు చేయాలనేది లక్ష్యం. జనవరిలో 100 బస్సులను తీసుకొస్తాం. కాలం చెల్లిన బస్సుల స్థానంలో హైర్ ప్రాతిపదికన వెయ్యి బస్సుల వరకూ ప్రవేశపెడుతున్నాం. నెల రోజుల్లో ఇవి రంగ ప్రవేశం చేయనున్నాయి.’’ అని పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ సేవలు, సంస్థలో ఇంకా మెరుగు పడాల్సిన అంశాలపై ప్రయాణికులతో మంత్రి అజయ్ మాటామంతి నిర్వహించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సహకరించాలని పువ్వాడ అజయ్ కుమార్ ప్రయాణికులకు పిలుపునిచ్చారు. 
 
ఈ సందర్భంగా ఎంపీ నామ  మాట్లాడుతూ rtc ని లాభల్లోకి తీసుకొచ్చేందుకు తీసుకున్న వివిధ నిర్ణయాల్లో భాగంగా ప్రజాప్రతినిధులు కూడా ఆర్టీసీలో ప్రయాణం చేయాలని మంత్రి అజయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందన్నారు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చడం లో ఆర్టీసీ పాత్ర చాలా కీలకం మరియు ఆర్టీసీ బస్సు లో ప్రయాణం ఎంతో సురక్షితమన్నారు నామా.

మరింత సమాచారం తెలుసుకోండి: