ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మార్పు చేయడాన్ని ఆంధ్ర జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తీవ్రంగా తప్పబట్టారు. కేవలం కమ్మ సామాజిక వర్గం పై కక్ష తోనే జగన్ ఇలా చేస్తున్నారని తన పత్రికలో రాశారు. చంద్రబాబు పై కక్ష ఉంటే ఆయన్ని రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేరుగా జగన్ డిమాండ్ చేయాలట. 

 

 

తెల్లవాడి పుణ్యమా అని మూడు రాజధానులు ఏర్పడి ఆర్థికంగా సతమతమవుతున్న దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకోవడంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దార్శనికత ఏ స్థాయిదో తెలుస్తోందని ఆర్కే విమర్శించారు. అమరావతిని చంపేయడానికి అక్కడ కమ్మ సామాజికవర్గం వారికి కూడా భూములు ఉండటం కారణమైతే ప్రభుత్వం అదే విషయం ప్రకటించాలని ఆర్కే అంటున్నారు. అదే నిజమైతే నష్టపరిహారం చెల్లించి వారిని అమరావతి నుంచి తరిమేయండని సూచిస్తున్నారు. 

 

 

కులం మార్చుకోవడం సాధ్యం కాదు కనుక.. మత మార్పిడి చేయించండి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారణమైతే ‘‘బాబూ! 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నావు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లకుపైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావుగా? ఇక చాలు రాజకీయాల నుంచి తప్పుకో’’ అని చెప్పండి అని ఆర్కే తన వ్యాసంలో రాశారు.

 

 

ఆయన ఇంకా ఏమంటున్నారు అంటే "అప్పుడు ఆయనను తప్పుకోవాలని ప్రజలే ఒత్తిడి తెస్తారేమో చూద్దాం. అంతేగానీ.. రాష్ట్ర భవిష్యత్‌, ప్రజల ప్రయోజనాలతో ఆడుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలకు మంచిది కాదు. రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్న మేధావులు, విజ్ఞులు ఎవరైనా ఉంటే నోరు తెరిచి తప్పొప్పులు చెప్పాలి. జగన్మోహన్‌రెడ్డి స్థానంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండివుంటే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది జగన్మోహన్‌రెడ్డికి శోభనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌కు ఇక భవిష్యత్‌ లేదు అనే అభిప్రాయం ఇతర ప్రాంతాలవారిలో ఏర్పడితే అందుకు జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కారణం అవుతారు అంటూ హెచ్చరిస్తున్నారు. మరి జగన్ అంటేనే మండి పడే ఆర్కే ఇలా రాయడం ఆశ్చర్యం కలిగించే అంశం కాదు కదా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: