సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని విమర్శలు చేశారు. నిన్న గుంటూరులో జరిగిన సీపీఐ 95వ వార్షికోత్సవం బహిరంగ సభలో నారాయణ పాల్గొన్నారు. సభలో నారాయణ చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాజధాని అమరావతికి 33 వేల ఎకరాల భూమిని సమీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 
 
రాజధాని రెండు, మూడు వేల ఎకరాల్లో కట్టుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని నారాయణ అన్నారు. రాజధానిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అభివృద్ధి చేయాలనుకోవడం సబబు కాదని నారాయణ చంద్రబాబును ఘాటుగా విమర్శించారు. చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా అని నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. 
 
కుక్క పని కుక్క చేయాలని గాడిద పని గాడిద చేయాలని అలా చేయకపోవటం వలనే చంద్రబాబు బొక్కా బోర్లా పడ్డారని నారాయణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పి జీఎన్ రావు కమిటీ నివేదికకు నారాయణ తన మద్దతు తెలిపారు. సచివాలయం, అసెంబ్లీ ఒకేచోట ఉండాలని నారాయణ అన్నారు. నారాయణ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు, టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా బీజేపీ ప్రభుత్వం మతప్రాతిపదికన దేశాన్ని విచ్చిన్నం చేయాలనుకుంటోందని వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ ఉన్న రాజధానిని కొనసాగించాలని రామకృష్ణ చెప్పారు. సభకు ఎమ్మెల్సీలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఇతరులు హాజరయ్యారు. 

 

మరోవైపు సీఎం జగన్ రాజధానిని భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. భీమిలి త్వరలో మహా పట్టణంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యలు చేశారు. విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం, అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: