ఓ  బాలికకు  మూగ జీవాలపై విపరీతమైన ప్రేమ.. వాటికి ఎక్కడ ఏ కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే అక్కడ ఆమె వాలిపోతుంది. ఆ మూగజీవులను అక్కున చేర్చుకుని వాటిని ఆరోప్రాణంగా కాపాడుతుంది. ఆమె తణుకుకు చెందిన జనత హాస్పటల్‌ దంత వైద్యుడు డాక్టర్‌ దాట్ల సుందరరామరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె పావని వర్మ. నిజానికి ఈ వారసత్వం ఆమెకు తాతయ్య డాక్టర్‌ దాట్ల సత్యనారాయణరాజు(జనతా రాజు), నాన్న సుందరరామరాజుల నుంచి వచ్చిందని చెప్పవచ్చు.

 

తణుకు లయన్స్‌క్లబ్‌ ప్రాంతంలోని నివాసం వద్ద అవుట్‌ హౌస్‌లో తాత, నాన్న, పావని ఎప్పటి నుంచో వివిధ రకాల కోళ్లు, బాతులు, కవుజు పిట్టలు, కుందేళ్లను వంటి ప్రాణులను సంరక్షిస్తున్నారు. పావని మరో అడుగు ముందుకేసి జంతు సంరక్షణ చేస్తూ యానిమల్‌ రెస్క్యూ టీంని సృష్టించేందుకు ప్రయతిస్తోంది.

 

 సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తిగా తీసుకొని  ఏ జంతువును అకారణంగా ఇబ్బంది పెట్టినా వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదుతో పాటు సదరు జంతువును రక్షించేందుకు  వాలంటీర్లను నియమించేందుకు సమాయత్తమవుతోంది. ఇందుకు ఆమె సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంది.  ఇప్పటికే తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావును మూగజీవాల సంరక్షణకు స్థలం ఇప్పించాల్సిందిగా కోరిగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పావని చెప్పింది. తనకు మూగజీవాలంటే ఇష్టమని, అయితే చదువు పరంగా తాను  ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ప్రస్తుతం వీరి వద్ద చైనా కోళ్లు, పోలీస్‌ క్యాప్‌ కోళ్లు, కజానా బాతులు, గిరిరాజు కోళ్లు ఉన్నాయి. వీటి సంరక్షణకు  సీసీ కెమెరాలతో పాటు సెయింట్‌ బెర్నాడ్‌ జాతికి చెందిన సింహాల్లాంటి మూడు శునకాలు కూడా గస్తీ నిర్వహించడం విశేషం.  

 

కుక్కలు, గోవులతో పాటు ఇతర జంతువులంటే కూడా మా అమ్మాయికి ఎంతో ఇష్టం. వాటిని బాధించకూడదని ఆమె తాపత్రయపడుతుంది. మా ఇంటి ఆవరణలో ఐదేళ్లుగా నాన్న సహకారంతో వివిధ రకాల కోళ్లు, బాతులు, కుందేళ్లు, కౌజు పిట్టలను సంరక్షిస్తున్నాను. వాటిని చూసిన మా అమ్మాయి చలించిపోయి యానిమల్స్‌ రెస్క్యూ టీంను ఏర్పాటుకు నాంది పలికింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: