మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఐదో రోజు రిలే నిరాహారదీక్షల్లో రైతులు తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. ఇక, స్థానికుల రైతుల ఆందోళనకు మద్దతుగా విద్యార్దులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఇక, పోలీసులు సైతం ఆందోళనలను నియంత్రించే చర్యలు వారు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆందోళన చేస్తున్న వారిపై ఆరు కేసులు నమోదయ్యాయి. మందడంలో పడవ రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగటంతో, పోలీసులు పడవను అక్కడినుంచి తొలిగించారు. ధర్నా కోసం వేసిన టెంట్ ను సైతం వాళ్లు తీసేసారు. పోలీసుల తీరు పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పైన తిరిగి ప్రవేటు కేసులు పెడతామని రైతులు చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు సైతం ఈ దీక్షల్లో పాల్గొంటున్నారు. 

 

ఇది ఇలా ఉంటే రాజధాని తరలింపు నిరసిస్తూ అమరావతి ప్రాంత స్థానికులు,  రైతులు చేస్తున్న ఆందోళనల్లో విద్యార్ధులు పాల్గొన్నారు. అమరావతి పరిధిలోని విట్ కళాశాలకు చెందిన విద్యార్ధులు మందడంలో రైతులతో కలిసి దీక్ష చేసారు. రాజధాని తరలించవద్దని అక్కడి స్థానికులు డిమాండ్ చేసారు. ప్రాణాలైనా అర్పిస్తాం, రాజధానిని రక్షించుకుంటాం అని నినాదాలు వాళ్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి రైతులు ఆందోళన చేస్తున్నారు. 

 

వెలగపూడిలో ఐదో రోజు దీక్షలు కొనసాగుతున్నాయి. అదే విధంగా ప్రధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయుని పాలెంలో వంటా వార్పు ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఇక, విద్యార్దులు సైతం రైతులకు మద్దతుగా నిలిచారు. తమ భవిష్యత్ కోసమే రైతులు త్యాగాలు చేసారని, వారికి మద్దతుగా పోరాటం చేస్తామని స్పష్టం చేసారు. అయితే రాజధానిలో మూడు రోజులుగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రైతులపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. రాజధాని పరిధిలో 144వ సెక్షన్‌, 30 పోలీసు యాక్టు అమల్లో ఉన్నప్పటికీ మల్కాపురం జంక్షన్‌ లో ధర్నాలో ఎక్కువ మంది గుమ్మిగూడడమే కాక ఎంతచెప్పినా వినకుండా రాజధాని రైతులు పోలీసులతో గొడవపడి వాగ్వాదానికి దిగారని రూరల్‌ ఎస్పీ విజయరావు తెలియచేశారు. 

 

బారికేడ్‌లు పడేసిన ఘటనలను సీసీ ఫుటేజీలు, వీడియోలు, బాడీవోన్‌ కెమెరాల ద్వారా చిత్రీకరించినట్లు రూరల్‌ ఎస్పీ ఈ సందర్బంగా తెలిపారు. సెక్రటేరియట్‌ వైపు దూసుకెళ్ళి ప్రవేశద్వారం వద్ద పోలీసు అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన వారిపై రెండు కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. పలు పంచాయతీ కార్యాలయాలకు నలుపురంగు వేసిన వ్యక్తులపై కూడా మూడు కేసులు నమోదు చేశామన్నారు. తుళ్ళూరులోని నీటి పైపు లైన్‌ వద్ద సిబ్బందిని భయపెట్టి నీటి సరఫరాను అడ్డుకొన్న ఘటనలో ఇంకొక కేసు పెట్టామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: