తెలుగుదేశం పార్టీలోని ప‌రిణామాల‌తో... ఆ పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డిపోతున్నారా? ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచే ఇంకా తేరుకోని ప‌రిస్థితుల్లో..తెలుగుదేశం పార్టీ నేత‌లు చేస్తున్న కామెంట్లు ఆయ‌న్ను ఇర‌కాటంలో ప‌డేస్తున్నాయా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. చంద్ర‌బాబు ప‌రిస్థితి క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు....విడవమంటే పాముకు కోపం అన్న‌ట్లుగా మారిపోయిందంటున్నారు. ఇదంతా, మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న విష‌యంలోనే.

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన ఏపీలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు త‌మ వైఖ‌రుల‌ను వెల్ల‌డించారు. ఇందులో త‌మ త‌మ ప్రాంతాల‌కు అనుగుణంగా...ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వైఖ‌రిని స‌మ‌ర్థించిన వారు అధికంగా ఉన్నారు. స‌హ‌జంగానే సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యానికి టీడీపీ నేత‌లు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం క‌ల‌క‌లం రేపింది. మ‌రోవైపు రాజధాని ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో నిరనస వ్యక్తం చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో రాజ‌ధానులు అనే ప్రకటనను ఉప సంహరించుకుని రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇలా ఓ వైపు రైతుల ఆందోళ‌న‌లు..మ‌రోవైపు తెలుగుదేశం నేత‌ల కామెంట్తతో చంద్ర‌బాబు ఇర‌కాటంలో ప‌డిపోయారంటున్నారు.  అధికార వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతుంటే..తాము మాత్రం ఇలా లుక‌లుక‌ల‌తో ఉండిపోవ‌డం..పార్టీలో ఐక్య‌త లేక‌పోవ‌డం అనేది స్ఫ‌ష్ట‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు ఫీలవుతున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో, రాజ‌ధాని విష‌యంలో స్పందించేవారు ఎవ‌రూ త‌మ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. పార్టీలో చ‌ర్చించి త‌గు రీతిలో రియాక్ట‌వ్వాల‌ని...మాజీ మంత్రులు, సీనియ‌ర్లు మాత్రం వీలైనంతవ‌ర‌కూ సంయ‌మ‌నం పాటించాల‌ని చంద్ర‌బాబు సూచించిన‌ట్లు తెలుస్తోంది.

 

 

మ‌రోవైపు...అమ‌రావ‌తిలో తాము ఏం చేశామో వివ‌రించాల‌ని ఆయ‌న సూచించిన‌ట్లు స‌మాచారం. గత ప్రభుత్వ హయాంలో తుళ్లూరుతో కలుపుకుని రాజధాని అమరావతి ప్రతిపాదిత 29 గ్రామాలకు 217.82 చదరపు కిలోమీటర్లతో మహానగరానికి, 8603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతానికి ముసాయిదా మాస్టర్ ప్లాన్లను సింగపూర్ సంస్థలు అందించాయని తెలియ‌జేయాల‌న్నారు. `గత ప్రభుత్వం రూ. 900 కోట్లు ఖర్చు చేసింది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఐదు దశల్లో రాజధాని అభివృద్ధికి డిజైన్లు రూపొందించింది. 2029 నాటికి రాజధానికి సమగ్ర స్వరూపం తీసుకురావాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. జనాభా పెరుగుదల, ఉపాధి, వౌలిక వసతుల కల్పన, విద్యా, వైద్యం, రవాణా వ్యవస్థ, పాలనా వ్యవహారాలకు సంబంధించి 21 జోన్లుగా వర్గీకరించి రాజధాని అభివృద్ధిని సూచించింది.` అని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని బాబు హిత‌బోధ చేసిన‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: