టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయిన చాలా మంది నాయకులు ఈ మధ్య గళమెత్తుతున్నారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇప్పుడు ఇదే విధంగా స్పందిస్తున్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు పాటించిన నియంతృత్వ పోకడలను బయటపెడుతున్నారు. రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు ఏనాడూ దృష్టి పెట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

అధికారంలో ఉండగా రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు దృష్టిపెట్టలేదన్నారు కేఈ. ఐదేళ్ల పాటూ అమరావతి, ఉత్తరాంధ్రపైనే ఆయన ధ్యాస పెట్టారు తప్ప ఇటువైపు దృష్టి సారించలేదని వాఖ్యలు చేశారు.  రాయలసీమ నుంచి సీఎం అయిన జగన్ కూడా చంద్రబాబులా  వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత రాజధాని విషయంలో అయినా రాయలసీమకు న్యాయం జరగాలి. విశాఖ, అమరావతిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి.. కర్నూలులో హైకోర్టు పెట్టినంత మాత్రాన రాయలసీమకు ఒరిగేదేమీ లేదు. గతంలోనే రాజధానిని పోగొట్టుకున్న రాయలసీమకు ఇప్పుడూ అన్యాయమే జరిగింది.. అంటూ వాఖ్యలు చేశారు. నిజానికి.. టీడీపీ అధికారంలో ఉండగా కూడా డిప్యూటీ సీఎం హోదాలో కేఈ కృష్ణమూర్తి పలుమార్లు చంద్రబాబుపై పలు వాఖ్యలు చేసేవారు. అప్పట్లో అవి చర్చనీయాంశంగా మారేవి. కర్నూలు రాజకీయాలపై చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా ఇందుకు ఊతమిచ్చేది.

 

 

సొంత పార్టీ నేతలు ఈమధ్య చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేఈ వాఖ్యలు కూడా తీసివేయటానికి లేదు. గతంలో కర్నూలులో జరిగిన సభలోనే చంద్రబాబు రాయలసీమను పట్టించుకోవట్లేదనే అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజధాని మార్పు అంశంతో కేఈ వాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. కేఈ కూడా రాజకీయాల్లో చంద్రబాబుకు సమకాలీకుడే. రాయలసీమ వెనుకబాటును పలుమార్లు చంద్రబాబుతో చర్చించారు కూడా. కేఈ వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు, చంద్రబాబు నాయుడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: