పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మొదలైన ఆందోళనలు ఇప్పుడు యావత్‌ భారతానికి విస్తరించాయి. దేశ రాజధాని దిల్లీ సహా చాలా రాష్ట్రాలు నిరసనలు, అల్లర్లతో అట్టుడుకిపోతున్నాయి. అయితే ఆందోళనల కారణంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. అల్లర్ల వల్ల భారత రైల్వేకు 88కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. 

 

బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ నుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు వీలుగా తెచ్చిన సీఏఏ చట్టంపై నిరసనల తీవ్రత పెరుగుతోంది. అసోం, బెంగాల్‌ రాష్ట్రాల్లో ఆందోళనకారులు చాలా చోట్ల రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టారు. ట్రాక్‌లను ధ్వంసం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆందోళనల కారణంగా తూర్పు రైల్వే జోన్‌ పరిధిలో 72 కోట్ల రూపాయల విలువ చేసే రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇక ఆగ్నేయ రైల్వే జోన్‌లో 13 కోట్లు, నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ జోన్‌లో 3 కోట్ల ఆస్తులు ధ్వంసమైనట్లు అధికారులు చెప్పారు. 

 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింసాకాండపై కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోద్రా అనంతర పరిణామాలు పునరావృతమౌతాయంటూ కామెంట్ చేశారు. దీంతో కర్ణాటక సీఎం యడియూరప్ప మాట్లాడే మముందు పదిసార్లు ఆలోచించుకోవాలని వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టంతో రగిలిన  సెగ త్వరలో చేపట్టబోయే జాతీయ పౌర జాబితా కు తగిలింది. బీజేపీ మిత్రపక్షాలన్నీ ఒకటొకటిగా దూరం జరుగుతున్నాయి. ఎన్నార్సీ అమలుచేసే ప్రసక్తే లేదని బీహార్ సీఎం నితీష్ ప్రకటించారు. బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ కూడా ఇదే వైఖరితో ఉన్నారు. మరో భాగస్వామ్య పక్షం అకాలీదళ్‌ కూడా విముఖత తెలిపింది. రాంవిలాస్‌ పసవాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాక తక్షణం ఎన్‌డీఏ సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. అసోం గణపరిషత్‌ ఇప్పటికే వ్యతిరేకత ప్రదర్శించింది. అదే బాటలో మరికొన్ని బీజేపీ మిత్రపక్షాలూ ఉన్నాయి.

 

ఎన్నార్సీపై వైఖరిని వెల్లడించని బీజేపీ భాగస్వామ్యపక్షం అన్నాడీఎంకే ఒక్కటే. ఈ విషయమై ఆ పార్టీలో తర్జనభర్జన సాగుతోంది. ఓవైపు పౌరసత్వ సవరణ చట్టంపై రచ్చ జరుగుతుండగా.. వెయ్యి మంది మేధావులు దీనికి మద్దతుగా లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: