ఏ దేశానికైనా సైన్యం చాలా కీలకం. సైన్యానికి చెందిన ఏ చిన్న వివరం బయటకు పొక్కినా.. దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్టే. అందుకే సైన్యంలో చాలా కఠినమైన క్రమశిక్షణ అమల్లో ఉంటుంది. అలాంటిది ఇండియన్ నేవీ సిబ్బందిపై పాకిస్థాన్ హనీ ట్రాప్ పన్నడం.. ఆ ఉచ్చులో చిక్కుకున్నవాళ్లు.. దేశ రక్షణ రహస్యాల్ని బట్టబయలు చేశారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. 

 

అందమైన అమ్మాయి ఫొటో ప్రొఫైల్ పిక్‌గా ఉంటుంది. ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. యాక్సెప్ట్ చేయగానే చాటింగ్ మొదలవుతుంది. మొదట పిచ్చాపాటీ కబుర్లు...మీరేం చేస్తారు..? ఎక్కడుంటారు...? మీ హాబీలేంటి? ఏ సినిమాలు ఇష్టం.. ఇలా కొన్నిరోజులు సాగుతుంది చాటింగ్. తర్వాత అసలు పని మొదలవుతుంది. తియ్యటి కబుర్ల నుంచి ముచ్చట్లు విధి నిర్వహణ మీదకు వెళతాయి. అసలేమీ తెలియదన్నట్టుగా  సముద్రంలో యుద్ధ నౌకలంటే ఎలా ఉంటాయి?  ఏ టెక్నాలజీ ఆధారంగా అవి పనిచేస్తాయి... అంటూ అందాల యువతులు చాటింగ్‌లో అమాయకంగా ప్రశ్నిస్తారు. తమతో మాట్లాడతోంది ఎవరో తెలియని అవతలివాళ్లు అంతే ఉత్సాహంతో చెప్పకూడని సమాచారమంతా వాళ్లతో చెప్పేస్తారు. పాకిస్థాన్ నడిపించిన హనీ ట్రాప్ లో జరిగింది ఇదే...అంతే కాదు...చాటింగ్‌లో పడని నావికాదళ సిబ్బందికి, కొందరు యువతులను ఎరగా వేసి, వారు ఏకాంతంగా ఉన్న దృశ్యాలు చిత్రీకరించి వాటితో బ్లాక్ మెయిల్‌కు పాల్పడి రహస్య సమాచారం సేకరించింది పాక్. భారత నావికాదళం లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన ఈ భారీ కుట్ర తీవ్ర ప్రకంపనలు కలిగిస్తోంది. 

 

విశాఖ, ముంబై, కార్వార్‌ నౌకాస్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన ఆపరేషన్ ను నిఘావర్గాలు బయటపెట్టాయి. నేవీ అధికారులకు అందం ఎరగా వేసి పాకిస్థాన్ హనీ ట్రాప్ చేస్తున్న విషయాన్ని పసిగట్టిన నిఘావర్గాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. దర్యాప్తు ప్రారంభించాయి. విశాఖ పట్టణం, ముంబై, కార్వార్ నౌకాదళాల నుంచి ఏడుగురు నావికులు వేర్వేరు మహిళలతో మాట్లాడుతున్నట్టు గుర్తించాయి. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ మొదలుపెట్టాయి. పాకిస్థాన్ భారత నౌకాదళ సిబ్బందికి అమ్మాయిలను ఎరవేయడంతో పాటు హవాలా ద్వారా డబ్బు కూడా పంపిస్తోందని గుర్తించాయి. ప్లాన్ ప్రకారం నిఘా ఉంచి హవాలా ద్వారా దళారీ నుంచి నావికులు డబ్బులు తీసుకుంటున్న సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నాయి. 

 

ఏడుగురు నౌకాదళ సిబ్బందితో పాటు ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్‌ను కూడా అదుపులోకి తీసుకున్న దర్యాప్తు బృందాలు వారిని విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో ప్రవేశపెట్టాయి. నిందితుల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరికొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: