వరి, రాగుల పంటలను శత్రు కీటకాల నుండి కాపాడు కునేందుకు అక్కడి రైతులు జీలుగ కల్లును ఉపయోగిస్తారు. అందుకు  పొలం మధ్య జీలుగ చెట్టు కొమ్మలు నాటతారు. తద్వారా పురుగు మందులను తమ దరిదాపుల్లోకైనా రానివ్వకుండా సస్యరక్షణ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామాన్ని ఆంధ్ర ప్రదేశ్‌లో తొలి సేంద్రియ గ్రామంగా గుర్తింపు తెచ్చారు. తూరుపు కనుమల ప్రాంతాల్లో జీలుగ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. పగలంతా కాయకష్టం చేసిన గిరిజనులు జీలుగ కల్లుతో సేదతీరుతారు. ఈ ఊరి ప్రజలు మాత్రం, అదే కల్లును జీడిమామిడి తోటలపై పిచికారీ చేసి, తెగుళ్లను నివారిస్తున్నారు.

ప్రకృతి సాగు దిశగా అడుగులు..
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుకు దగ్గరలో మారుమూల ఆది వాసీ పల్లె అది. అక్కడ భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గ్రామ సంఘాలుగా ఏర్పడి, ప్రకృతి సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. తమ పంటలకు స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి పొలాల్లో అడుగుపెడితే చాలు తెలియని అనుభూతి కలుగుతుంది. ప్రక్రుతి అందాలు కళ్లేదుటే కదలాడుతుంటాయి.  భూమిలోంచి పైకి లేచిన వాన పాములు పాదాలకు గిలిగింతలు పెడుతుంటాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, మిత్రకీటకాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. గోరింకలు, పాలపిట్టలు,పిచ్చుకల రెక్కలు రెపరెప కొట్టుకుంటూ గాలిలోకి లేస్తుంటాయి. రసాయన ఎరువులు లేని ఈ మట్టిపరిమళం ఈ జీవాలకు నీడైంది. ఇక్కడి ప్రజలు ఐక్యతా, ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్ఛంగా మార్చింది. 


కొండల మధ్య కుగ్రామం
విజయనగం జిల్లా కురుపాం మండలంలో పెదకొండ, తోటకొండ, తివ్వకొండల మధ్య ఉన్నదే కొండబారిడి. అక్కడ వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. అక్కడి 70 కుటుంబాలలో, 63 మంది రైతులు. వారంతా సంఘాలుగా ఏర్పడి ‘జట్టు ట్రస్టు’తో జతకట్టి, శిక్షణ తీసుకున్నారు. 95 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు. ఈ మార్పు వెనుక, ‘జట్టు ట్రస్ట్‌’ వ్యవస్ధాపకుడు డి.పారినాయుడు కృషి ఉంది. కొంత కాలం ప్రభుత్వ టీచర్‌గా పని చేసి, ఉద్యోగం వదిలేసి, గిరిజనులందరినీ ఒక జట్టుగా మార్చి కొండబారిడి గ్రామాన్ని ప్రకృతి సాగుకు ప్రయోగ శాలగా మార్చారాయన. నారు వేసింది మొదలు కోత కోసి, దాన్ని విక్రయించే వరకూ గ్రామస్తులే కీలకపాత్ర పోషిస్తారు. ఇలా సాగు చేసి, గతంలో కంటే, 40 శాతం ఎక్కువ దిగుబడి సాధించారు. దీనితో కొండల మధ్య ఉన్న ఈ కుగ్రామం వైపు అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఎంతో  ఆశ్చర్యంగా చుస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: