హైద‌రాబాద్ ట్రాఫిక్ గురించి, ఆ ట్రాఫిక్ క‌ష్టాల గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌గ‌రంలో ఉండే వారికి ట్రాఫిక్ క‌ష్టాలు రోజూ స‌హ‌జ‌మే. అయితే, ఈ ట్రాఫిక్ విష‌యంలో తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే.టీ.రామారావు అధికారులకు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ప్రగతిభవన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి కారణంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్య అధికమవుతున్నట్లు, దీన్ని అధిగమించేందుకు పెద్ద ఎత్తున స్లిప్‌రోడ్లను (ప్రత్యామ్నాయ రోడ్లు) అందుబాటులోకి తేవాలని కోరారు. నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో స్లిప్‌రోడ్లను  అందుబాటులోకి తేవాలని కోరారు. 

 

 


హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధీనంలోని రోడ్ల వివరాలను ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. అలాగే హైటెన్షన్‌ వైర్ల కింద(పవర్‌ కారిడార్లలో) రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఒక నివేదిక సిద్ధంచేయాలని అధికారులను కోరారు. రోడ్ల నిర్మాణంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సమన్వయంతో ముందుకుసాగాలని మంత్రి సూచించారు. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సులభంగా తమ గమ్యస్థానాలు చేరుకునే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేటీఆర్‌కు అధికారులు తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంలో భాగంగా ఇప్పటికే వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ)ను అమలుచేస్తున్నట్లు, అంతేకాకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే ఉద్దేశంతోసమీకృత రోడ్ల నిర్వహణ కార్యక్రమాన్ని(సీఆర్‌ఎంపీ) చేపట్టినట్లు వివ‌రించారు. దీంతో పాటు కూడళ్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 

పాదచారుల సౌకర్యార్థం పెద్దఎత్తున ఫుట్‌పాత్‌ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు, ప్రతి జోన్‌లో పది కిలోమీటర్ల చొప్పున జనసమర్థంగల రోడ్లపై ఫుట్‌పాత్‌లు నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో బస్‌బేల నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 55స్లిప్‌రోడ్లను గుర్తించినట్లు, వాటి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు. వీటి నిర్మాణానికి భూసేకరణతోపాటు రోడ్ల నమూనాలు సిద్ధంచేస్తున్నట్లు వారు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: