డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినప్పుడు రచ్చకావడం.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం.. ఈ కారణాలు వారిని బయటకు వెళ్లి తాగాలనే ఆలోచనను ఆపేస్తున్నాయి. కానీ..తాగాల‌నే కోరిక ఉంది. మ‌రి పరిష్కారం ఏంటి? డ‌బ్బులు ఉంటే దేనికైనా ప‌రిష్కారం ఉంటుంది క‌దా. అందుకే...ఇంట్లోనే ఓ బార్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు హైద‌రాబాద్‌లోని కొంద‌రు ప్ర‌ముఖులు. ఇందులో స‌కల బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఏకంగా ఓ మినీ బార్‌ను పోలిన విధంగా రూంలను అందంగా అలంకరించుకుంటున్నారు.

 

భాగ్యనగరంలో హోం బార్ కల్చర్ విస్త్రతమవుతుంది. విల్లాల్లో ఈ హోం బార్  కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. హోం బార్‌తో చాలా ఉపయోగాలుంటాయని కొంతమంది వీఐపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలాంటి వాగుడు వినిపించదు. ప్రశాంతమైన వాతావరణం.. ఓ వైపు స్లోగా మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. మరోవైపు కలర్‌ఫుల్ లైట్స్ మిణుకుమిణుకుమంటూ ఇంద్రధనుస్సును కండ్ల ముందు ఉంచుతాయి. అలాంటి వాతావరణంలో నచ్చిన మందు. ఇలా స్నేహితులు, బంధువులు, కావాల్సిన వారితో పెగ్ షేర్ చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు సెలబ్రెటీలు. అంతేకాదు ఫారిన్ నుంచి మద్యం బాటిళ్లను తెప్పించుకుని ర్యాక్‌ల నిండా ఉండేలా చూసు కుంటున్నారు. ఏ గెస్ట్ ఏ మందు అడుగుతాడో ముందే గుర్తించి.. అందుకు సంబంధించిన బ్రాండ్‌లను అందుబాటులో ఉంచుకుంటున్నారు. 

 

స్నేహితులు, బంధువులు ఏ సమయంలోచ్చినా ఒక పెగ్ తీసుకునే సౌకర్యం ఉంచుకునే ఈ హోం బార్‌ల విష‌యానికి వ‌స్తే..ప్రత్యేక ఇళ్లు, విల్లాల్లో నివాసం ఉంటున్న వారు ఈ తరహా ఏర్పాట్లను చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి ఎక్కువ‌గా మహానగరంలో ఆదిబట్ల, శంషాబాద్, బాచుపల్లి, శంకరపల్లి, శామీర్‌పేట్, మణికొండ, బంజా రాహిల్స్, ఫిల్మ్‌నగర్, బోడుప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కల్చర్ కనిపిస్తోంది. ముఖ్యంగా నగరానికి సెల‌బ్రిటీలు పొలిటీషియన్స్, వీఐపీలు వచ్చినప్పుడు ఆ తరహా బార్‌లోనే ఆతిథ్యం ఇస్తుంటామని ఈ హోం బార్లు ఉన్న‌వారు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: