వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 
 
సెప్టెంబర్ నెలలో గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలను నిర్వహించి మెరిట్ ఆధారంగా అధికారులు నియామక పత్రాలను అందజేశారు. అక్టోబర్ 2వ తేదీ నుండి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు విధుల్లో చేరారు. 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలలో వివిధ కారణాల వలన కొన్ని పోస్టుల భర్తీ జరగలేదు. అధికారులు గ్రామ, వార్డ్ సచివాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నారు. 
 
ప్రభుత్వం మిగిలిపోయిన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయో ఆ వివరాలను ఈరోజు సాయంత్రంలోపు పంపాలని 13 జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. ఖాళీ పోస్టుల వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారీగా పంపాలని గిరిజా శంకర్ సూచించారు. 
 
పంచాయతీరాజ్ శాఖ జిల్లాల నుండి వివరాలు అందిన తరువాత ఆ వివరాలను సంబంధిత శాఖలకు పంపి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ జారీ చేయటానికి తగిన చర్యలు తీసుకుంటోంది. దాదాపు 15,000 నుండి 20,000 ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందని సమాచారం. జనవరి నెలలో మిగతా ఉద్యోగాలతో పాటు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు కూడా భర్తీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: