ఓ వైపు ఏపీ రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు పార్టీల మధ్య కేపిటల్ ఫైట్ నడుస్తూనే ఉంది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన కామెంట్లు మరింత నిప్పును రాజేశాయనే చెప్పాలి. ఇక రాజధాని మార్పు అంత ఈజీ కాదంటూ టెక్నికల్ పాయింట్లను తెర మీదకు తెచ్చారు మాజీ మంత్రి పత్తిపాటి.

 

అమరావతిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన కామెంట్లు తీవ్ర సంచలనం సృష్టించాయి. అమరావతిని ఎడారితో పోలుస్తూ స్పీకర్ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశంగా మారాయి. 

 

స్పీకర్ తమ్మినేని కళ్లు లేని కబోధిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. స్పీకర్ ఎప్పుడైనా అమరావతిని చూశారా అని ప్రశ్నించారు. తన కారులో వస్తే స్పీకర్ కు మొత్తం తిప్పి చూపిస్తానన్నారు వర్ల రామయ్య. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, పరిపాలన అంతా ఎడారి నుంచి నడుస్తోందా! అని నిలదీశారు.  

 

అటు రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులకు టీడీపీ సంఘీభావం ప్రకటించింది. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది టీడీపీ విధానమనే విషయాన్ని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలింపు అంత ఈజీ కాదని.. అనేక ఇబ్బందులు ఉంటాయంటూ కొన్ని టెక్నికల్ అంశాలను ప్రస్తావించారు పత్తిపాటి. 

 

ఏపీ రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఉద్దండరాయుని పాలెం, మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో రైతులు.. రైతు కుటుంబాలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో రోడ్డెక్కి ధర్నాలు నిర్వహించారు. రాజధానిని ప్రస్తుతమున్నఅమరావతి కేంద్రంగానే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన వారు రోడ్డెక్కిన పరిస్థితి. ఇత మందడం సెంటర్‌లో టెంట్‌ వేసుకుని తమ ఆందోళన చేపట్టాలని రైతులు ప్రయత్నిస్తే.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సుమారు ఐదు గంటలపాటు మండుటెండలోనే రైతులు.. మహిళలు, పిల్లలు తమ నిరసనను రోడ్‌పై భైఠాయించి కొనసాగించారు. అలాగే వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగించారు. ఇక తుళ్లూరు, పెద్ద పరిమి వంటి గ్రామాల్లో ఇక రాజధాని పరిధిలో గత రెండేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విట్‌ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు రైతులకు సంఘీభావంగా భారీ సంఖ్యలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంలో మందడం నుంచి వెలగపూడి వైపు ర్యాలీగా వెళ్తూ మార్గం మధ్యలో సచివాలయం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా అమరావతిలో రాజధాని రగడ మరింత రాజుకోనుంది. రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: