నేను నచ్చకపోతే.. నన్ను తిట్టండి! నా దిష్టిబొమ్మలు తగుల బెట్టండి!! కానీ పేదల ఆస్తులు ఎందుకు తగులబెడతారంటూ ప్రధాని మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. సిటిజన్‌ షిప్‌ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనల వెనుక కాంగ్రెస్‌, అర్బన్‌ నక్సల్స్ హస్తం ఉందని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ బిల్లు ఆమోదం పొందినప్పటి నుంచీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా దేశ పౌరులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు.  

 

సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఢిల్లీ పరిధిలో వెలిసిన అనధికార కాలనీలను రెగ్యులరైజ్‌ చేసిన సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో ఈ ధన్యవాద సభను ఏర్పాటు చేశారు.  ప్రతిఒక్కరూ పార్లమెంట్‌ చేసిన చట్టాన్ని గౌరవించాలని ప్రధాని చెప్పారు. పౌరసత్వ చట్టంగానీ, ప్రభుత్వ పథకాలు గానీ.. మతాన్ని ఆధారంగా చేసుకుని అమలు చేయడం లేదని తెలిపారు. సీఏఏతోపాటు ఎన్.ఆర్.సి విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని విమర్శించారు ప్రధాని. 

 

ఈ దేశంలో పుట్టిన ముస్లింలెవ్వరూ ఈ విషయాలలో భయపడాల్సిన పని లేదన్నారు మోడీ. హింసాత్మక ఘటనలు, పోలీసులపై దాడుల విషయంలోనూ తీవ్రంగా స్పందించారు ప్రధాని. ఒకవేళ మోడీ అంటే ఇష్టం లేకపోతే.. మోడీని తిట్టండి.. లేదా దిష్టిబొమ్మలు తగులబెట్టండి.. దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టండి. అంతేగానీ.. పేదల జీవనాధారమైన ఆటో రిక్షాలను ఎందుకు తగులబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను ఆపాలని వందేళ్లకు పైబడి చరిత్ర కలిగిన పార్టీ ఒక్క ముక్కా మాట్లాడటం లేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు ప్రధాని. 

 

పాక్‌, బంగ్లా, ఆఫ్గన్‌ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులకు పౌరసత్వం కల్పించాలని వాదించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీ స్వార్థ రాజకీయాల కోసం రాత్రికి రాత్రి తమ విధానాలను మార్చుకున్నారని విమర్శించారు మోడీ. సీఏఏను అమలు చేయబోమని చెబుతున్న ఆయా రాష్ట్రాలు.. అలా చేయొచ్చే లేదో కనీసం న్యాయ సలహా తీసుకుని ప్రకటన చేయాలని హితవు  పలికారు ప్రధాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: