ఎగ్జిక్యూటీవ్‌ కేపిటల్‌ రీజియన్‌గా విశాఖ స్వరూపం ఎలా ఉండబోతుంది? భీమిలి కేంద్రంగా ఏర్పడే రాజధాని పరిధిలోకి ఏఏ ప్రాంతాలు తీసుకువస్తారు? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఉత్తరాంధ్ర ప్రగతి.. భీమిలి పట్టణం దశ ఒకేసారి మారిపోతుందని భావిస్తున్న వేళ  రాజధాని నిర్మాణంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.



ఒక రాష్ట్రం... మూడు రాజధానుల ఫార్ములాతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాచబాట పడిందనే చర్చ జోరందుకుంది. భీముని పట్టణానికి రాజధాని యోగం పట్టడంతో విశాఖ శివారు ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయి. భీమిలి ఏపీ కార్యనిర్వాహక రాజధాని అవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడంతో.. అందరి దృష్టి ఈ ప్రదేశంపై పడింది. రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయ్‌. కాపుల ఉప్పాడ, రుషికొండ ప్రాంతాలు దాదాపు ఫైనల్ అయినట్టేనని అనుకుంటున్నారు. విశాఖ తూర్పు, పెందుర్తి, విజయనగరం జిల్లాలు సరిహద్దులుగా ఉండటంతోపాటు...ఈ మధ్యలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఐఐఎం., సమీర్ వంటి క్యాంపస్‌ల నిర్మాణం ఇక్కడే జరుగుతోంది. ఆంధ్రా సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే రుషికొండ ఐటీ కార్యాలయం కూడా ఈ ప్రాంతం పరిధిలోనే ఉంది.  కాపుల ఉప్పాడతోపాటు ఆనందపురం మండలం పరిధిలోని తర్లువాడ, గండిగుండం, కణమాం, జగన్నాథపురం ప్రాంతాల్లో వివిధ సంస్థల కోసం ఇప్పటికే వందల ఎకరాలను కేటాయించారు.

 

రాజధాని తరలిరానున్న తరుణంలో తాత్కాలిక అవసరాలు, శాశ్వత నిర్మాణాలకు అనుకూలమైన భవనాలు, భూముల అన్వేషణ ప్రారంభమైంది. విశాఖ-భీమునిపట్టణం రోడ్డులోని సముద్రానికి అభిముఖంగా కొండ, దిగువన వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి వుంది. గత ప్రభుత్వం ఇక్కడి కొండను ఆదాని డేటా సెంటర్ నిర్మాణానికి కేటాయించింది. దీనికి అనుగుణంగా ఇక్కడ మాస్టర్ ప్లాన్ రహదారులు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. వీటితోపాటు శాశ్వత నిర్మాణాల కోసం అనుకూలమైన భూముల కోసం అధికారులు అన్వేషణ జరుగుతోంది.

 

రాజధాని ప్రకటన రాకముందే విశాఖ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విజయనగరం జిల్లా భోగాపురాన్ని కేపిటల్ పరిధిలోకి తీసుకువచ్చే యోచనలో ఉంది. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. విశాఖకు ముఖద్వారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ ప్రతిపాదించిన మెట్రో రైలును భోగాపురం వరకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. టెండర్ల దశలో ఆగిపోయిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కూ కదలిక రానుంది. కేపిటల్ పరిధిలోకి భోగాపురాన్ని తీసుకువచ్చి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ప్రారంభిస్తారని సమాచారం. ఇప్పటికే భూ సేకరణ పూర్తయ్యింది. ఎయిర్ పోర్ట్ పనులు చురుకుగా జరిగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అదే సమయంలో కేపిటల్‌ రీజియన్ నుంచి భోగాపురాన్ని కలుపుతూ బీచ్ రోడ్ నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం ఆర్కేబీచ్-రుషికొండ మీదుగా భీమిలి వరకూ డబుల్ లైన్ రహదారులు ఉండగా...వీటిని విస్తరించనున్నట్టు సమాచారం. మెట్రో, భోగాపురం ఎయిర్‌పోర్ట్ పై ఇటీవల విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు.

 

డచ్ కాలంలో వ్యాపార, వాణిజ్య, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న భీమిలి... దేశంలో ఏర్పాటైన రెండో మున్సిపాల్టీ. బౌద్ధం విస్తరించిన తొట్లకొండ, బావికొండతోపాటు డచ్ కాలం నాటి ఆనవాళ్లు సజీవంగానే ఉన్నాయ్‌. గత ఐదేళ్లలో 3500కోట్ల రూపాయల పనులకు శంఖుస్ధాపనలు జరిగినా అవి పూర్తికాలేదు. ఏడేళ్ల క్రితం భీమిలి మునిసిపాలిటీని జీవీఎంసీలో విలీనం చేశారు. కాపుల ఉప్పాడతోపాటు నాలుగు గ్రామాలు విలీనాన్ని వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం పెండింగ్‌లో పడింది. ఇప్పుడు రాజధాని ఏర్పాటు కానుండటంతో విలీన ప్రక్రియను రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం కొలిక్కి తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: