ఒక్కోసారి చిన్న తప్పులు కూడా పెద్ద శిక్షలు పడేలా చేస్తుంటాయి. రెండు రూపాయలే కదా ఏమవుతుందిలే అనుకుంది కంపెనీ, నా రెండు రూపాయలను ఎందుకు వదులుకోవాలి అనుకున్నాడు వినియోగదారుడు. కోర్టు మెట్లు ఎక్కాడు కంపెనీ నుంచి నష్టపరిహారం పొందాడు. ఇంతకీ ఈ రెండు రూపాయల కథేంటి. 

 

చండీగఢ్ లో షెయిల్ మార్కెటింగ్ కంపెనీ అనే స్టోర్ ఉంది, ఈ స్టోర్ పతంజలి ప్రొడక్ట్స్ అమ్ముతుంది. కొన్ని రోజుల ముందు ఆనంద్ అనే వృద్దుడు స్టోర్ కు వచ్చి తనకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేసాడు. అతను తీసుకున్న సరుకుల మొత్తానికి గానూ బిల్లు రూ 118 గా వేశారు స్టోర్ వాళ్ళు కానీ ఆనంద్ మాత్రం రూ 116 మాత్రమే చెల్లిస్తానన్నాడు. తనకు ఇచ్చిన బిల్లులో పౌష్టిక్ మేరీ అనే బిస్కెట్ ప్యాకెట్ ఎంఆర్పీ రూ.10 ఉంది. కానీ, స్టోర్ వాళ్లు బిస్కెట్ ప్యాకెట్ ఖరీదును రూ.12గా బిల్లు వేశారు. దీనికి అభ్యంతరం చెప్పారు ఆనంద్. కానీ స్టోర్ వాళ్ళు మాత్రం రూ 118 చెల్లించాల్సిందే అంటూ పేర్కొన్నారు. చేసేదేమీ లేక బిల్లు చెల్లించి అక్కడినుంచి వచ్చేసారు ఆనంద్. 

 

తనకు అన్యాయం జరిగిందంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు ఆనంద్. జరిగినదంతా తెలుసుకున్న ఫోరమ్  షెయిల్ మార్కెటింగ్ కంపెనీని పిలిచింది. బిల్లు తప్పుగా వేయడంపై వివరణ కోరింది. "మేము ఉద్దేశపూర్వకంగా బిల్లు ఎక్కువగా వెయ్యలేదు, బిల్లింగ్ సాఫ్ట్ వేర్ లో జరిగిన తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగింది. గతంలో మా పై ఎటువంటి ఫిర్యాదులు లేవు" అంటూ చెప్పుకొచ్చింది కంపెనీ. కంపెనీ వివరణతో సంతృప్తి చెందని ఫోరమ్ షెయిల్ మార్కెటింగ్ స్టోర్ వినియోగదారుడికి రూ 1500 నష్టపరిహారంగా, రూ 1000 కేసు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. ఇక బాధితుడి నుంచి అదనంగా వసూల్ చేసిన రూ 2 కూడా వెనక్కి ఇచ్చేయాలని స్టోర్ ను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: