అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 2019 - 20 సంవత్సరానికి ప్రధానమంత్రి పంటల బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలు కొరకు తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో రబీ సీజన్ నుండి పంటల బీమాను 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ పథకంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఈ పథకం ప్రకారం వ్యవసాయ శాఖ నిర్దేశించిన ప్రాంతాలలో గుర్తించిన సాగుదారులందరికీ 100 శాతం బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. 101 కోట్ల రూపాయల వాటా ధనంతో 2013 కంపెనీల చట్టానికి అనుగుణంగా ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ ఈ మొత్తాన్ని సమకూర్చుతుంది. వ్యవసాయ శాఖ పంటల బీమాకు అర్హులైన సాగుదారులకు సంబంధించిన సమాచారాన్ని వ్యవసాయ శాఖ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తుంది. 
 
పథకం అమలులో సాగుదారులు లేదా ప్రభుత్వం ఏ సంస్థకు కూడా సబ్సిడీ చెల్లించదు. పంటల బీమాకు అర్హమైన క్లెయిమ్స్ ను ప్రభుత్వమే పరిష్కరిస్తుంది. ప్రభుత్వం ఆధార్ నెంబర్ లింక్ అయిన బ్యాంకు ఖాతాలలో క్లెయిమ్ మొత్తాలను జమ చేస్తుంది. వ్యవసాయ శాఖ ఈ పథకం అమలుకు నోడల్ విభాగంగా వ్యవహరించి క్లెయిమ్ ల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అజమాయిషీ ఉండేలా చూస్తుంది. 
 
ప్రణాళికా విభాగం పంట కోతల ప్రయోగాలకు మరియు పంట దిగుబడికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఆలోచనతో ఖరీఫ్ లో రైతుల కొరకు బీమా ప్రీమియంను చెల్లించింది. వ్యవసాయ శాఖ కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలోకి తీసుకొనిరావాలని నిర్ణయించింది. ప్రభుత్వం పథకం అమలులో మార్పులు చేర్పులు చేయటం కొరకు అనుమతి ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: