దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ కేసులో నేడు కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుంది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచిన దిశ నిందితుల మృతదేహాలకు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు శనివారం ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. అత్యంత సీనియర్లయిన ముగ్గురు ఎయిమ్స్ ఫోరెన్సిక్ వైద్య నిపుణులతో మెడికల్ బోర్డు ఏర్పాటుచేయాలని తెలిపిన నేప‌థ్యంలో...హైకోర్టు ఆదేశాల మేర కు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం.. రీపోస్టుమార్టం నిర్వహించనుంది. నలుగురు నిందితుల మృతదేహాలకు హైదరాబాద్ గాంధీ దవాఖానలో సోమవారం ఉదయం రీపోస్టుమార్టం జరుగనుంది.

 

రీపోస్ట్‌మార్టం విష‌యంలో హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎయిమ్స్ మెడికల్ బోర్డు సభ్యులను విమానంలో తీసుకువచ్చి, సాధ్యమైనంత త్వరగా మృతదేహాలకు రీపోస్ట్‌మార్టంచేయాలని ఆదేశించింది. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం డీకంపోజ్ అయ్యాయని కోర్టుకు హాజరైన గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ వెల్లడించినందున.. సమయం ఎక్కువగా లేదని.. ఈ నేపథ్యంలో ఈ నెల 23 సాయంత్రం 5 గంటల వరకు రీపోస్ట్‌మార్టం పూర్తిచేయాలని స్పష్టంచేసింది. రీపోస్ట్‌మార్టం అనంతరం మెడికల్ బోర్డు సేకరించిన ఆధారాల ప్రకారం స్వతంత్రంగా ముగింపు అభిప్రాయాన్ని వెల్లడించాలని తెలిపింది. ఈనేప‌థ్యంలో, ముగ్గురు సీనియ‌ర్ల  వైద్యుల బృందం రీ పోస్ట్‌మార్టం చేయ‌నుంది. ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ పర్యవేక్షణలో డాక్టర్ ఆదర్శకుమార్, డాక్టర్ అభిషేక్ డాక్టర్ వరుణ్ మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహిస్తారు. ఈ మేర‌కు ముగ్గురు వైద్యుల బృందం ఢిల్లీ నుంచి ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. ఎయిమ్స్ అధికారుల రీపోస్ట్‌మార్టం అనంత‌రం మృతదేహాలను కుటుంబ స‌భ్యుల‌లకు అప్పగించారు. ఆ వెంటనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. 

 

ఇదిలాఉండ‌గా, ఇప్ప‌టికే దిశ నిందితుల కుటుంబ స‌భ్యుల సంచ‌ల‌న డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ న‌లుగురు పిల్ల‌ల‌ను పోలీసులు కాల్చిచంపార‌ని, ఈ విష‌యంలో త‌మ‌కు న్యాయం చేయాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సుప్రీంకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వాజ్యం కూడా దాఖ‌లు చేశారు. వారి అనుమానాల ఆధారంగానే రీపోస్ట్‌మార్టం జ‌రుగుతోంది. ముగ్గురు ప్ర‌ముఖ వైద్యుల బృందం పోస్ట్‌మార్టం చేయ‌డంతో వారు చేసిన డిమాండ్లు నిజం కానున్నాయా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: