`తెలంగాణ కోసం గ‌ల‌మెత్తిన‌ బ‌క్కోడిని ప‌క్క‌కు జ‌రిపితే క‌త అయిపోత‌ది అని అనుకున్న‌రు. కానీ మీరంత క‌లిసి వ‌చ్చిండ్రు. ఉద్య‌మించినం. తెలంగాణ సాధించినం` ఇది త‌ర‌చుగా...తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పే మాట‌. మలిద‌శ తెలంగాణ ఉద్య‌మాన్ని మొద‌లుపెట్టింది, న‌డిపించింది తానేన‌ని ప్ర‌క‌టించుకునే కేసీఆర్ ఈ మేర‌కు ఎక్క‌డా తేడా రాకుండా ప్ర‌జ‌లంద‌రి భాగ‌స్వామ్యాన్ని కూడా అదే రీతిలో ప్ర‌స్తావిస్తుంటారు. ఒక్క దీక్ష‌తో ఉద్య‌మం రూపాన్ని మార్చివేశారు. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించి చూపించారు. అనంత‌రం ప‌రిపాల‌న‌లో కూడా త‌న ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

 

డిసెంబ‌ర్ 9న కేంద్రం వెలువ‌రించిన ప్ర‌క‌ట‌న తెలంగాణను ద‌శ‌ను మార్చింది. అయితే, ఈ ప్ర‌క‌ట‌న రావ‌డానికి కేసీఆర్ వ్యూహం కార‌ణం. హైదరాబాద్ ఫ్రీ జోన్‌తో మొదలైన రగడ ఉద్వేగాలను రగిల్చడంతో....తెలంగాణ ఏర్పాటు కోరుతూ కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. తెలంగాణ రాష్ట్రంతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. దీంతో తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇటు రాష్ట్ర రాజకీయాలను, అటు కేంద్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రకటనను సాధించింది. ఇలా అంత‌కుమందున్న రాష్ట్రాల డిమాండ్‌కు భిన్నంగా ప్ర‌త్యేక రాష్ట్ర ప్ర‌క్రియ విష‌యంలో కేసీఆర్ త‌న స‌త్తా చాటుకున్నారు. తెలంగాణ కంటే ముందే ప్రారంభ‌మైన రాష్ట్రాల డిమాండ్లు నేటికీ కొన‌సాగుతుండగా...కేసీఆర్ మాత్రం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవ‌డమే కాకుండా సొంత రాష్ట్రాన్ని కొన్ని అంశాల్లో దేశానికి స్ఫూర్తిగా నిలుపుతున్నారు. 

 

డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన నాటి నుంచి ప్ర‌త్యేక పార్టీ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాల స్వీక‌ర‌ణ‌ వ‌ర‌కూ కేసీఆర్ త‌న‌దైన శైలిలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌తి చ‌ర్య‌లోనూ త‌న‌దే పైచేయిలాగా ఉండేలా న‌డుచుకుంటూనే... ప్ర‌జ‌ల‌ను, పార్టీ నేత‌ల‌ను సైతం భాగం చేసుకున్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర పోరాటం,ప‌థ‌కాల విష‌యంలో కూడా క్రెడిట్ ద‌క్కేలా ఉండ‌టం కేసీఆర్ మార్క్ వ్యూహ‌మ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: