డిసెంబర్ 6వ తారీఖున చటన్ పల్లి వద్ద దిశ హత్య కేసులోని నిందితులు.. పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. చనిపోయిన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో భద్రపరచబడ్డాయి. అయితే, ఈరోజు ఉదయం 10గంటల సమయంలో గాంధీ ఆసుపత్రిలోని మార్చరీ లో వారి మృతదేహాలకు రీ పోస్టుమార్టంని ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులు ప్రారంభించారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి సుదీప్ గుప్త నేతృత్వంలో డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, రీ పోస్టుమార్టంని నిర్వహిస్తుండగా.. గాంధీ ఆసుపత్రి డాక్టర్ వరుణ్ చంద్ర ఎయిమ్స్ బృందానికి సహాయ పడుతున్నాడు. కొద్దిసేపటి క్రితమే నిందితుల కుటుంబాలు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే రీ పోస్టుమార్టం జరుగుతున్నదని తెలుస్తుంది.


ఇకపోతే, హైకోర్టు డిసెంబర్ 23న సాయంత్రం ఐదు గంటల లోపు మృతదేహాల రీ పోస్టుమార్టం నివేదికను పొందుపర్చాలని ఎయిమ్స్‌ వైద్యులను ఆదేశించింది. రీ పోస్టుమార్టం చేస్తున్న ముగ్గురు డాక్టర్ల బృందం ప్రస్తుతం శరీరంలో ఎటువంటి గాయాలయ్యాయి, గాయలవెనుక ఉన్న అసలు కారణాలేంటని పరిశీలిస్తున్నారు. రీ పోస్టుమార్టం చేస్తున్నంతసేపు వీడియో తీసి రిపోర్ట్ ని హైకోర్టులో సమర్పించాలని హై కోర్టు ఆదేశించింది. దాంతో రీ పోస్టుమార్టంని వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఈ వీడియో మొత్తాన్ని, ఇంకా పోస్టుమార్టం నివేదికను ఒక సీల్డ్ కవర్ లో సీల్ చేసి హైకోర్టుకు సమర్పించనున్నారు ఎయిమ్స్ డాక్టర్ల బృందం. ఒక్కొక్క బాడీని ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయం పాటు రీ పోస్టుమార్టం చేయనున్నారు.



ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ సీల్డ్ కవర్లో భద్రపరిచి కోర్టులో సమర్పించే అవకాశాలు ఉన్నాయి. రీ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను మర్యాదపూర్వకంగా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. కాగా, 2 డిగ్రీల సెల్సియస్లో ఫ్రీజర్ లో ఉంచినప్పటికీ మృతదేహాల 50 శాతం కుళ్లిపోవడంతో అంత్యక్రియలను ఈ రోజే జరపవల్సిందిగా నిందితుల కుటుంబాలను పోలీసులు ఒప్పించారు. ప్రస్తుతం, ఎన్కౌంటర్ జరగక ముందు రోజు నిందితులకు ఏమైనా గాయాలయ్యాయి అనే కోణంలో ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: