నరేంద్రమోడి, అమిత్ షా కు జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకిచ్చారు. నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్ షిప్ చట్టాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్దితుల్లోను అమలు చేసేది లేదని జగన్ సంచలన ప్రకటన చేశారు.  ఎన్ఆర్సీ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏమి గొడవ జరుగుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్ధితి ప్రశాంతంగానే ఉంది.

 

ఇదే విషయమై పార్లమెంటులో జరిగిన ఓటింగ్ లో ను కేంద్రప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీలు మద్దతు పలికాయి. అయితే తాజాగా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లే కనబడుతోంది. కేంద్రం అమలు చేయాలని అనుకుంటున్న ఎన్ఆర్సీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితమే ఉపముఖ్యమంత్రి అమ్జాద్ పాషా చెప్పినపుడు అందరూ ఆశ్చర్యపోయారు.

 

పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి మళ్ళీ ఇపుడు వ్య తిరేకంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడటమేంటని విమర్శలొచ్చాయి. పార్టీకి ఒక విధానం లేదా అంటూ ప్రతిపక్షాలు జగన్ ను ఎగతాళి చేశాయి. ఈరోజు కడపలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఇదే విషయమై మాట్లాడారు. వేదిక మీద నుండే  ముస్లిం నేతలను పలిపించి ఉపముఖ్యమంత్రి సమక్షంలోనే తన మనసులోని మాటను బయటపెట్టారు. మూడు రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి తనతో మాట్లాడిన తర్వాతనే ప్రకటన చేశారంటూ క్లారిటి ఇచ్చారు.

 

సొంతజిల్లాలో అదికూడా ఓ వేదికపై నుండే జగన్ ఎన్ఆర్సీ చట్టం అమలుపై ప్రభుత్వ స్టాండ్ ప్రకటించటం సంచలనంగా మారింది. తాజాగా జగన్ చేసిన ప్రకటనతో కేసియార్ నిర్ణయానికి మరింత బలం వచ్చినట్లైంది. తెలంగాణాలో కూడా కేసియార్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చూస్తుంటే దేశవ్యాప్తంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: