దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం పూర్త‌యింది. సోమవారం ఉదయం మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించిన తర్వాతే రీపోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో చేసిన వైద్య బృందానికి సంబంధం లేకుండా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. రీపోస్టుమార్టం ప్రక్రియ హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరిగినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో రీపోస్టుమార్టం పూర్త‌యింది.

 

ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ శాఖ అధిపతి సుధీర్ గుప్తాతో పాటు అభిషేక్ యాదవ్, ఆదర్శ్ కుమార్ వైద్య బృందం రీపోస్టుమార్టం ప్రక్రియను నిర్వహించింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సుమారు నాలుగు గంటల పాటు నిందితుల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించింది. ఈ ప్రక్రియను ఎయిమ్స్ వైద్యులే వీడియో తీశారు. ఈ వీడియోను రెండు రోజుల్లో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ కు అప్పగించనున్నట్లు ఎయిమ్స్ వైద్యుల బృందం తెలిపింది. రీపోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. 

 


ఎయిమ్స్ మెడికల్ బోర్డు సభ్యులను విమానంలో తీసుకువచ్చి, సాధ్యమైనంత త్వరగా మృతదేహాలకు రీపోస్ట్‌మార్టంచేయాలని ఆదేశించింది. ఇప్పటికే మృతదేహాలు 50 శాతం డీకంపోజ్ అయ్యాయని కోర్టుకు హాజరైన గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ వెల్లడించినందున.. సమయం ఎక్కువగా లేదని.. ఈ నేపథ్యంలో ఈ నెల 23 సాయంత్రం 5 గంటల వరకు రీపోస్ట్‌మార్టం పూర్తిచేయాలని స్పష్టంచేసింది. రీపోస్ట్‌మార్టం అనంతరం మెడికల్ బోర్డు సేకరించిన ఆధారాల ప్రకారం స్వతంత్రంగా ముగింపు అభిప్రాయాన్ని వెల్లడించాలని తెలిపింది.

 

కాగా, రీపోస్ట్‌మార్టం విష‌యంలో హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. రీపోస్ట్‌మార్టం మొత్తాన్ని వీడియో రికార్డుచేసి.. ఆ ఫుటేజితోపాటు పోస్ట్‌మార్టం రిపోర్డులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని పేర్కొన్నది. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత అంత్యక్రియలకోసం మృతదేహాలను గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, పోలీసుల సమక్షంలో కుటుంబసభ్యులకు అప్పగించాలని సూచించింది. కేస్ డైరీ, లాగ్‌బుక్స్, వెపన్ ఎంట్రీలు, దిశ హత్యాచారం ఘటన నుంచి ఎన్‌కౌంటర్ జరిగే వరకు పోలీసుల కదలికల వివరాల రిపోర్ట్‌లు, ఎన్‌కౌంటర్‌లో వినియోగించిన ఆయుధాలను సీజ్‌చేయాలని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. వీటిని సమగ్ర పరిశీలన కోసం సెం ట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపాలని తెలిపింది. కాల్ రికార్డులు, నిందితులను తీసుకెళ్లిన పోలీస్‌స్టేషన్ సీసీ టీవీ ఫుటేజి, సెల్‌టవర్ లొకేషన్ వివరాలను కూడా సేకరించాలని సిట్‌ను ఆదేశించింది. ఇతర ఆధారాలను సేకరించి సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: