ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానిల వివాదం రగులుతున్న విషయం తెలిసిందే. దీనిపై అమరావతి రైతులందరూ తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . రాజధాని అమరావతి నుంచి మార్చొద్దు అంటూ  డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఇకపోతే  నిరసన తెలుపుతున్న వారివద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి  మద్దతు పలుకుతున్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 


 రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ఇంతకు ముందు ఇచ్చిన హామీ ప్రకారమే వాటిని అభివృద్ధి  చేస్తామని మంత్రి బొత్సా సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. జిఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై ఈనెల 27న క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నమని  మంత్రి బొత్స తెలిపారు. ఈ తరుణంలో రాజధాని ప్రాంత రైతుల పేరిట... కొందరు నిరసనలు తెలుపుతున్నారు అంటూ విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

 


 అమరావతిలో జరుగుతున్న నిరసనలు ఆందోళనను గురించి రెండు పత్రికలు రెండు చానెల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని ఉండాలని కోరుతూ ఆ ప్రాంతంలోని కొంతమంది నిరసనలు తెలుపుతుంటే  అక్కడికి చంద్రబాబు నాయుడు వెళ్ళి  మొసలి కన్నీరు కారుస్తున్నారు అంటూ మంత్రి బొత్స విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు వల్ల కాదని.. అవుటర్ రింగ్ రోడ్డు ఐటీ  వచ్చిన తర్వాతే హైదరాబాద్ అభివృద్ధి చెందినది అని  వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు... ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స. మూడు రాజధానిల విషయంలో ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో  వాళ్ళు మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి: