కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు. కరీంనగర్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన త‌న‌కు ఎదుర‌వుతున్న చిత్ర‌మైన పరిస్థితిని ఆస‌క్తిక‌రంగా విర‌వించారు. ``నా పేరు బండి సంజయ్, నేను కరీంనగర్ ఎంపీని` అని పరిచయం చేసుకున్నారు. కొంతమంది అధికారులు తనను గుర్తుపట్టడంలేదని అందుకే ఇలా ప‌రిచ‌యం చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని బండి సంజ‌య్ పేర్కొన్నారు. 

 


ఈ సంద‌ర్భంగా ఎంపీ బండి సంజ‌య్ అధికారుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా అభివృద్ధి కోసం జరిగే సమావేశం  మొక్కుబడిగా జరగరాదని ఆయన అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి సాధ్యమని.. లోటు పాట్లను సవరించుకుని ముందుకు సాగుదామని అధికారులతో సంజయ్ చెప్పారు. సమావేశానికి వచ్చే ముందు మొక్కుబడి నివేదికలతో రావద్దన్న ఆయన.. అధికారులిచ్చే సూచనలను స్వీకరిస్తామని.. కేంద్ర ప్రభుత్వం తరపున  ఎలాంటి సహాయం కావాలో కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కేంద్ర నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులను .. ఇవి కేంద్ర స్కీంలు అని ప్రజలకు అధికారులు చెప్పడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. 

 

కాగా, ఎంపీ బండి సంజయ్ కుమార్ బ‌ల‌మైన‌ హిందుత్వ వాదిగా ముద్ర‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల టీఆర్ఎస్ పార్టీపై సైతం ఆయ‌న విరుచుకుప‌డ్డారు. లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మధ్య  వాగ్వాదం జరిగింది. ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తోందని నామా నాగేశ్వరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్  మైనార్టీల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉందన్నారు. తమ పార్టీ లౌకికవాద పార్టీ అని, రాజ్యాంగ స్ఫూర్తికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందువుల ప్రయోజనాలు మాత్రం టీఆర్ఎస్ కు పట్టవా? అని నిలదీశారు. హిందువులు ప్రజలు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. దీంతో వాదులాట వద్దులే అన్నట్టుగా హోం మంత్రి అమిత్ షా సంకేతం ఇవ్వడంతో బండి సంజయ్ కూర్చున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: