‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’, ‘బద్రీనాథ్’ వంటి భారీ చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ కథారచయిత చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్‌ని స్థాపించి తొలి ప్రయత్నంగా ‘‘కింగ్ ఫిషర్’’ అనే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తనయులు చిరంజీవి సాయి, బద్రీనాథ్‌లను నిర్మాతలుగా పరిచయం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రచయిత చిన్నికృష్ణ ఏపీ రాజధానిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

అమరావతి రాజధాని నిర్మాణం దేశంలోనే భారీ స్కామ్ అని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను పటిష్టంగా అమలు చేస్తున్న నాయకుడు జగన్ అని ప్రశంసించారు. అభివృద్ధిని ఒక ప్రాంతానికే కేంద్రీకృతం చేస్తే ఏమవుతుందనేది హైదరాబాద్ విషయంలో అర్థం అయిందని పేర్కొన్నారు. చట్టాలు ఒక చోట, అమలు ఒక చోట, న్యాయ వ్యవస్థ ఒక చోట ఉండటం తప్పు కాదన్నారు. 

 

విశాఖపట్నం అందమైన, అద్భుతమైన నగరం అని.. రాజధానిగా విశాఖ సరైన ప్రదేశం అని చిన్ని కృష్ణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో రాజధానికి వెయ్యి ఎకరాలు సరిపోతుందని, 33వేల ఎకరాలు అవసరమే లేదన్నారు. గ్రాఫిక్స్‌లో రాజధానిని కట్టడం సినిమాలో జరుగుతుందని, రాజకీయాలలో కష్టం సాధ్యం అంటూ చంద్రబాబుకు చురకలంటించారు. అమరావతి నదీ పరివాహక ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్ చేయడం తప్పు అన్నారు. ఇప్పటికైనా రైతులు వాస్తవాలను గ్రహించి తమ తమ భూములను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను చిరంజీవి సపోర్ట్ చేయడాన్ని చిన్నికృష్ణ స్వాగతించారు. చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి అని, ఆయనపై బురదజల్లాలని చూస్తే అది తిరిగి వారిపైనే పడుతుందని వ్యాఖ్యానించారు.

 


చిన్నికృష్ణ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయనకు కొన్ని తిప్పలు రావచ్చని సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. సినీ రచయిత అయ్యుండి ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరన్నా ఉన్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ రచయిత చెప్పిన మాటలు కొందరి సంతోషకరంగానూ మరికొందరికీ ఆగ్రహం తెప్పంచేలా ఉన్నాయంటూ చర్చ సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: