వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి నిరుద్యోగులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జనవరి మొదటివారంలో టెట్, జనవరి చివరి వారంలో డిఎస్సీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు జనవరి 4వ తేదీన టెట్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
టెట్ షెడ్యూల్ విడుదల చేసిన వారం రోజుల తరువాత ధరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతున్నారని సమాచారం. సాధారణంగా ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహించాలి. కానీ గతేడాది ఫిబ్రవరిలో మాత్రమే టెట్ పరీక్షను నిర్వహించారు. ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహిస్తుందా...? లేదా...? అనే విషయం తెలియాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు రెండు పేపర్లు నిర్వహిస్తారని సమాచారం. 
 
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నందున ఇంగ్లీష్ పేపర్ కూడా రాయాల్సి ఉంటుందని సమాచారం. టెట్ పరీక్ష ఆన్ లైన్ లో ఉంటుందా...? లేక్ ఆఫ్ లైన్ లో ఉంటుందా...? అనే వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించి కంప్యూటర్ల కొరత అనే కారణంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని సెంటర్లను కేటాయించారు. ప్రభుత్వం దూర ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలను కేటాయించటంపై అభ్యర్థుల నుండి నిరసన వ్యక్తమైంది. 
 
టెట్ పరీక్షలో జనరల్ 60 శాతం, బీసీ 50 శాతం, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. టీఆర్టీలో 20 శాతం వెయిటేజీ టెట్ రాసేవారికి ఉండటంతో టెట్  పరీక్ష రాసినా మెరుగైన మార్కుల కోసం మరలా పరీక్ష రాసే అవకాశం ఉంది. ఒకసారి టెట్ పరీక్ష రాస్తే ఏడు సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. ప్రభుత్వం టెట్, డీఎస్సీలకు నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేయనుండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: