ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ ఆర్సీని అమలు చేయబోమని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బీజేపీ తో చెలిమికిక చరమగీతం పాడినట్లేనా ?  అంటే అవుననే రాజకీయ వర్గాల నుంచి సమాధానం విన్పిస్తోంది . రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇన్నాళ్లూ బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం తో ఆయన సన్నిహితంగా కొనసాగుతూ వస్తున్నారు . ఇక  బీజేపీ నేతలు , రాష్ట్ర  ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు చేసిన మంత్రులు కానీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా స్పందించిన దాఖలాలు కూడా లేవు .

 

 బీజేపీ నేతల విమర్శలను ధీటుగా తిప్పికొడితే  ఎక్కడ కేంద్ర పెద్దలతో తలనొప్పి వస్తుందోనని భావించే  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ఆచితూచి వ్యవహరిస్తూ వస్తోంది . అయితే  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన  ఎన్ ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసేది లేదని కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తెగేసి చెప్పడం ద్వారా రానున్న రోజుల్లో బీజేపీ తో సఖ్యతగా కొనసాగేది లేదని సంకేతాలను ఇచ్చినట్లయింది . సీ ఏ బి (క్యాబ్ )కు ఉభయ సభల్లో మద్దతునిచ్చిన జగన్మోహన్ రెడ్డి , ఎన్ ఆర్సీ అమలుకు అసెంబ్లీలోను గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు .

 

అయితే ఎన్ ఆర్సీ అమలు వల్ల ముస్లిం మైనార్టీలు పార్టీకి దూరం అవుతారని భావించిన ఆయన , పార్టీ ప్రయోజన దృష్ట్యా  ఎన్ ఆర్సీ అమలు చేయరాదని నిర్ణయించి ఉంటారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు    . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోను, ప్రస్తుతం వైస్సార్ కాంగ్రెస్ కు ముస్లిం మైనార్టీలు దన్నుగా నిలుస్తున్నవిషయాన్ని వారు గుర్తు చేశారు  .  వారిని దూరం చేసుకోవడం రాజకీయంగా ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావించే , బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ ఆర్సీ అమలును జగన్ నో చెప్పి ఉంటారని  పేర్కొంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: