మ‌హారాష్ట్రలో మ‌రోమారు ఆస‌క్తిక‌రమైన రాజ‌కీయం తెర‌మీద‌కు వ‌చ్చే ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. అనూహ్య రీతిలో చ‌క్రం తిప్పి... ఆస‌క్తిక‌ర ప‌రిణామాల‌కు వేదిక‌గా మారిన‌ నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) సీనియర్‌ నాయకుడు అజిత్‌ పవార్ మ‌ళ్లీ ముఖ్య‌నేత‌గా మార‌నున్నారు. మ‌హారాష్ట్రకు మళ్లీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప‌రిణామాలు రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 

 

ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేసిన బీజేపీ-శివ‌సేన ముఖ్య‌మంత్రి విషంయ‌లో పేచీతో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఊహించ‌ని రీతిలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎంగా, ఎన్‌సీపీ నేత‌ అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి షాకిచ్చారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో బలపరీక్షకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ముందే దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫడ్నవీస్‌ రాజీనామా కంటే ముందే కుటుంబ సభ్యుల బుజ్జగింపులతో అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత శివసేన - కాంగ్రెస్‌ - ఎన్సీపీ కూటమి సారథ్యంలో ఉద్ధవ్‌ థాకరే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ట్విస్టుల ప‌రంప‌ర‌లో మ‌ళ్లీ అజిత్ డిప్యూటీ సీఎం పీఠం కైవ‌సం చేసుకోనున్నార‌ట‌.

 

ఉద్ద‌వ్ సీఎం పీఠం కోసం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన స‌మ‌యంలో... మిత్ర‌పక్షాలైన కాంగ్రెస్‌-శివ‌సేన‌- ఎన్‌సీపీ నుంచి డిప్యూటీ సీఎంగా ఎవరూ ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరనే అంశంపై స్పష్టత వచ్చిందంటున్నారు. ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవారే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఇప్పటికే సీఎం పదవిని దక్కించుకున్న శివసేన కీలకమైన హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖలను దక్కించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీకి ఆర్థిక శాఖ, గృహ నిర్మాణ శాఖ, కాంగ్రెస్‌ పార్టీకి రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కీలకమైన పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఏ పార్టీకి వరిస్తుందో తెలియాల్సి ఉంది. 

 

కేబినెట్ విస్తరణ కూడా డిసెంబర్ 30న జరిగే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో సీఎం ఉద్ధవ్‌ థాకరే, ఎన్‌సీపీ అధినేత‌ శరద్‌ పవార్ తాజాగా సమావేశమై డిప్యూటీ సీఎం పదవిపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేదు. అయితే, అజిత్‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఖాయ‌మంటున్నారు. డిసెంబర్‌ 30వ తేదీన అజిత్‌ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: