ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీకి సమానంగా సీట్లు కొల్లగొట్టి.. సత్తా చూపించిన కాంగ్రెస్, బీజేపీ మరో సమరానికి రెడీ అవుతున్నాయి. మున్సిపల్‌ పోరు కోసం డూ ఆర్‌ డై అనే రీతిలో పోటీకి సిద్ధమవుతున్నాయి. పట్టణాల్లో తమ పట్టును నిరూపించుకోడానికి కమలదళం వ్యూహాలు రెడీ చేస్తోంటే.. తాజా పరిస్థితులు తమకు కలసి వస్తాయని భావిస్తోంది కాంగ్రెస్‌.

 

తెలంగాణలో మున్సిపల్ పోరుకు నగరా మోగడంతో.. అనుసరించాల్సిన వ్యూహాల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఓ కమిటీ వేసింది పీసీసీ. జిల్లాల వారిగా ఇప్పటికే పర్యటనలను ప్లాన్ చేసిన కమిటీ.. రాష్ట్ర నాయకత్వం నుంచే మఖ్య నాయకులను ఎంపిక చేసి జిల్లాలకు ఇంఛార్జ్‌లను నియమించాలని భావిస్తోంది. రెండు రోజుల్లో ఇంఛార్జ్‌లను నియమించి.. స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వం వహిస్తోన్న నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకోంటుంది తెలంగాణ కాంగ్రెస్. 

 

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు.. అమలుకాకపోవడంతో వాటిని నగరవాసులకు గుర్తు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పీసీసీ. మగ్గురు ఎంపీలను ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా వాడాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోటీగా మున్సిపాటీల్లోని ప్రతీ వార్డులో అభ్యర్ధిని నిలబెట్టాలని డిసైడ్ అయ్యింది బీజేపీ. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్‌లు మినహా వాటిని ఒక్కో క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అంతేకాక, ప్రతీ మున్సిపాలిటీకి ఒక్కో రాష్ట్రస్థాయి నేతలను నియమించింది. 
 

కొందరు నేతలైతే.. మరో అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలిశారు. గ్రామీణ ప్రాంతాల కంటే.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి వేరుగా ఉంటుందని, పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేక ఫలితాలు పురపాలక పోరులో రావని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. గతంతో పోల్చుకుంటే కింది స్థాయి నేతలు ఎక్కువగా చేరడంతో.. కలిసొస్తుందని సత్తా చాటుతామంటున్నారు బీజేపీ నేతలు.

 

మొత్తం మీద.. లోకల్‌గా జరిగే పోరులో సత్తా చూపి తమ ప్రభావం చూపాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి రెండు నేషనల్‌ పార్టీలు. ఎంపీ ఎన్నికల మాదిరి అధికార పార్టీని ఖంగుతినిపిస్తాయో.. లేక పంచాయితీ ఎన్నికల మాదిరి తామే ఖంగుతింటాయో.. వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: