జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలోని ఓ విద్యాసంస్ధలో వెంకయ్య మాట్లాడారు. జగన్ ప్రతిపాదనపై ఇప్పటి వరకూ బిజెపి నేతలు వ్యక్తిగత హోదాలోనే స్పందించారు.  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,  రాజ్యసభ ఎంపి  జీవిఎల్ నరసింహారావు, ఎంఎల్సీ సోము వీర్రాజు,  అధికారప్రతినిధి రఘురామ్, నేతలు విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులంతా ముందు జగన్ ప్రతిపాదనలకు మద్దతు పలికారు. తర్వాత ఏమయ్యిందో ఏమో యూటర్న్ తీసుకున్నారు.

 

ఈ నేపధ్యంలోనే  రాష్ట్ర పర్యటనక వచ్చిన వెంకయ్య మాట్లాడుతూ జగన్ పేరు ఎత్తకుండానే వికేంద్రీకరణ జరగాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే తెలివిగా రాజధానుల వికేంద్రీకరణా ? లేకపోతే అభివృద్ధి వికేంద్రీకరణా ? అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. మొత్తంమీద వికేంద్రీకరణ జరగాల్సిందే అని మాత్రం చెప్పేశారు. అందుకనే జగన్ ప్రతిపాదనకు వెంకయ్య మద్దతుందని వైసిపి నేతలు చెప్పుకుంటున్నారు.

 

వికేంద్రీకరణ జరగకపోతే అభివృద్ధి మొత్తం ఒకేచోట కేంద్రీకృతమవుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల నుండి ఉద్యోగ, ఉపాధి కోసం  జనాలందరూ నగరాలకు తరలి వచ్చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.  గ్రామాల నుండి నగరాలకు జనాల వలసలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టంగా చెప్పారు.

 

వలసల వల్ల నగరాలపై ఒత్తిడి పెరిగిపోవటం వల్లే అనేక అనర్ధాలు జరుగుతున్నట్లు చెప్పారు. సరే మొత్తానికి వెంకయ్య చెప్పిన వికేంద్రీకరణ ఏదైనా జగన్ మాత్రం రాజధానిని విశాఖపట్నానికి తరలించుకుపోయేందుకు రెడీ అవుతున్నట్లు అర్ధమవుతోంది. ఇదే విషయమై ముందు జగన్ ప్రతిపాదనకు స్వాగతం పలికిన బిజెపి నేతల్లో కొందరు తాజాగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారో తెలియటం లేదు.  సరే జగన్ నిర్ణయానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో  వెంకయ్య మద్దతు తెలిపిన తర్వాత  మరి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: