నిజామాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం మారుతోంది. ప‌సుపు బోర్డు ఏర్పాటు విషయంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి.. బోర్డు అంబాసిడర్‌ లాంటిదని, కొత్త పథకం టయోటా లాంటిదని వ్యాఖ్యానించడం, బోర్డు కంటే ఉత్తమమైన పథకాన్ని తెస్తున్నామని చెప్పడంతో పసుపు రైతులు నిర్ఘాంతపోయారు. మరో సందర్భంలో పసుపు పంటపైన, బోర్డుపైన తనకు అవగాహన లేదని.. కేసీఆర్‌ను, కవితను ఓడించడంపై దృష్టి పెట్టానే తప్పా, పసుపు బోర్డుపై పెట్టలేదని పేర్కొనడం రైతులకు పుండుపై కారం చల్లినట్లయ్యింది. దీంతో, గ‌త లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి బరిలోకి దిగిన జగిత్యాల జిల్లాకు చెందిన స్వతంత్ర అభ్యర్థులు, రైతులు జగిత్యాలలో సమావేశమై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు పోరుబాట పట్టాల‌ని డిసైడ‌య్యారు.

 

 

నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పసుపు పండించే రైతులు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. తాను గెలిచిన ఐదు రోజుల్లోనే బోర్డు ఏర్పాటు చేయిస్తానని, లేదంటే రాజీనామా చేస్తానని ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్‌ బాండ్‌పేపర్‌ రాసిచ్చాడని రైతులు గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటం.. నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తుండటంతోనే బోర్డు ఏర్పాటు కావడం లేదని, తనను గెలిపిస్తే బోర్డు అదే వస్తుందంటూ రైతులను నమ్మించాడని చెప్పారు. ఎంపీ గా గెలిచి ఏడు నెలలు గడిచినా ఇంతవరకు పసుపుబోర్డు ఊసు ఎత్తకపోవడం, రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో పసుపు రైతులు, అభ్యర్థులుగా నిలిచిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 


పసుపు రైతులను నమ్మించి మోసం చేసిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యవహార శైలి, పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో తప్పుడు ప్రకటనలు, పసుపుబోర్డు సాధనకు భవిష్యత్‌ కార్యాచరణపై జగిత్యాలలో సోమవారం రైతు నాయకులు సమావేశమయ్యారు. నిజామాబాద్‌ లోక్‌సభకు బరిలోకి దిగిన 175 మంది రైతుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన 61 మంది అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతులను తప్పుదోవ పట్టించిన ఎంపీ అర్వింద్‌ను ఎక్కడికక్కడ నిలదీయాలని నిర్ణయించారు. జగిత్యాల జిల్లాలో అర్వింద్‌ ఏ కార్యక్రమానికి హాజరైనా అడ్డుకోవాలనీ నిర్ణయించారు. పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని, క్వింటాల్‌కు రూ.15 వేల గిట్టుబాటు ధరను కల్పించాలంటూ జగిత్యాల కలెక్టర్‌ శరత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: