ఒక ఐడియా.. మీ జీవితాన్నిమార్చేస్తుంది!!- ఇది ఓప్ర‌క‌ట‌న‌లో వ‌చ్చే సందేశం. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఒకే ఒక్క ఐడియాతో రాష్ట్ర ముఖ చిత్రాన్నిస‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. నిన్న వ‌ర‌కు ఉన్న ఏపీ భౌగోళిక ప‌రిస్థితినే ఆయ‌న మార్చేయ‌నున్నారు. జ‌గ‌న్ వేసుకున్న ప్ర‌ణాళిక‌లో ఇప్ప‌టికే ఒక వ్యూహం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేస‌మ‌యంలో మ‌రో వ్యూహాన్ని కూడా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి బ‌య‌ట‌కు చెప్పారు. త్వ‌ర‌లోనే ఏపీలోని 13 జిల్లాల‌ను 25 జిల్లాలుగా మార్చ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. త‌ద్వారాఏపీపై జ‌గ‌న్ బ‌ల‌మైన ముద్ర వేయ‌నున్నార‌ని తెలిపారు.

 

సో.. ఈ రెండు నిర్ణ‌యాలు అంటే .. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు,.. అనంత‌రం రాష్ట్రంలో పాతిక జిల్లాల ఏర్పాటు ద్వారా జ‌గ‌న్ సాధించే విజ‌యం ఆయ‌న‌ను రాష్ట్రంలో ఒక తిరుగులేని శ‌క్తిగా తీర్చి దిద్దు తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే సీమ స‌హా ఉత్త‌రాంధ్ర జిల్లాలు అభివృద్ధి కోసం అర్రులు చాస్తున్నాయి. సామాజికంగా భౌగోళికంగా కూడా ఈ ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వ‌ల‌స‌లు పెరిగిపోయాయి.

 

ఈ క్ర‌మంలో జ‌గ‌న్ తీసుకుంటున్న మూడు రాజ‌ధానుల నిర్మాణం కార‌ణంగా నిరంతరం అధికారులు అక్క‌డే ఉండ‌డం, ప్ర‌భుత్వ భ‌వ‌నాలు సిబ్బంది అక్క‌డే ఉండ‌డం వ‌ల్ల మౌలిక ప‌రిస్థితులు మెరుగ‌వుతాయి. అదే స‌మ‌యంలో పాతిక జిల్లాల ఏర్పాటు వ‌ల్ల‌.. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌తోపాటు పాల‌న‌పై ప్ర‌భుత్వానికి మ‌రింత ప‌ట్టు పెరుగుతుంది. జిల్లాలు కుదించ‌బ‌డ‌డంతోపాటు.. అధికారుల సంఖ్య, మౌలిక వ‌స‌తుల సంఖ్య పెరిగి.. ప్ర‌భుత్వ పాల‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతుంది.

 

ఇప్ప‌టికే గ్రామ స‌చివాల‌యాలు, వార్డుల ద్వారా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ను చేరువ చేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు, రాజ‌ధానుల విభ‌జ‌న‌తో మ‌రింత ముందుకు సాగ‌డంతోపాటు ప్ర‌జ‌ల్లో సుస్థిర‌మైన గుర్తింపును సొంతం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. మ‌రి జ‌గ‌న్ ఏ విధంగా దూసుకుపోతార‌నే విష‌యాన్ని మున్ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: