బీజేపీ ర‌థ‌సార‌థులు న‌రేంద్ర మోదీ, అమిత్‌షాకు ఊహించ‌ని షాక్ ఎదురైంది. పాక్, అప్ఘాన్, బంగ్లాదేశ్‌లలో మత హింసను ఎదుర్కొంటున్న ఆరు ముస్లిమేతర మతాల వారికి భారత పౌరసత్వం కల్పిస్తామంటూ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్టును కేంద్రం తెచ్చింది. 2014 డిసెంబరు 31కి ముందు భారత్‌కు వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నవాళ్లకు ఈ అవకాశం కల్పించేలా పౌరసత్వ చట్టంలో భారత ప్రభుత్వం మార్పు చేసింది. అయితే, పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై బీజేపీలో తొలిసారి వ్యతిరేక గళం వినిపించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ (నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు) సోమవారం నాడు ఆ పార్టీ లైన్‌కు బిన్నంగా మాట్లాడారు. 

 

పౌరసత్వానికి మతానికి లింక్ పెట్టడాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు తప్పుబట్టారు. భారత్ ఎప్పుడూ అన్ని మతాలను, కులాలను సమానంగా చేస్తుందన్నారు. భారత పౌరసత్వం పొందడానికి మతంతో సంబంధం లేదని పౌరసత్వ చట్టం కూడా చెబుతోందని బోస్ అన్నారు. కానీ, హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతాలకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని CAA-2019లో ఎందుకు పేర్కొన్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బోస్. CAAలో ముస్లింలను కూడా కలపాలని కోరారు. ఒకవేళ వాళ్ల స్వదేశాల్లో ముస్లింలపై హింస జరగకుంటే భారత్‌కు రారని అన్నారు. భారత్‌ను ఇతర దేశాలతో పోల్చి చూడొద్దని, ఇక్కడ అన్ని మతాలు, కులాలు సమానమేనని చెప్పారాయన. బంగ్లాదేశ్, అఫ్ఘాన్, పాకిస్థాన్‌లలో ముస్లింలు కూడా అణిచివేత, హింసకు గురవుతున్నారని బోస్ చెప్పారు. పాక్, అఫ్ఘాన్లలో బతుకుతున్న బలూచీ, పాక్‌లోని అహ్మదీయా ముస్లింలు ఘోరమైన బాధలు ఎదుర్కొంటున్నారని, వారి సంగతేంటని ఆయన ప్రశ్నించారు.

 


ఇదిలాఉండ‌గా, పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ విద్యార్థుల నిరసనపై ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వద్ద విద్యార్థులు తనను అడ్డుకోవడం చాలా బాధాకరమని గవర్నర్‌ అన్నారు. రాష్ట్రంలో చట్టం పూర్తిగా పతనమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్బంధించిందని గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన తనను విద్యార్థులు అడ్డుకున్నారు. లోపల విద్యార్థులు డిగ్రీల కోసం ఎదురుచూస్తున్నారని గవర్నర్‌ తెలిపారు. స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌ను విద్యార్థులు చుట్టుముట్టి.. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఏఏకు అనుకూలంగా గవర్నర్‌ గతంలో మాట్లాడారు. దీంతో విద్యార్థులు గవర్నర్‌ను అడ్డుకున్నారు. వ‌ర్సిటీ ప‌నితీరు ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆందోళ‌న‌ల‌ను వ‌ర్సిటీ అదుపు చేయ‌లేక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: