మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు తెలుగుదేశంపార్టీలో మద్దతు పెరిగిపోతోంది. ఒకవైపు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలంటూ తీర్మానాలు చేయాలని చంద్రబాబు ఆదేశాలకు భిన్నంగా తమ్ముళ్ళు నడుచుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన  సమావేశంలో  జగన్ నిర్ణయానికే జై కొట్టారు.

 

విశాఖపట్నం అర్బన్, రూరల్ జిల్లాల సమావేశంలో  పాల్గొన్న నలుగురు ఎంఎల్ఏలు, ఎంఎల్సీ, మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్ధులతో సహా నేతలంతా జగన్ ప్రతిపాదనకు మద్దతుగా తీర్మానం చేశారు.  జగన్ నిర్ణయానికి మద్దతు పలికిన నేతల్లో నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ కూడా ఉండటం విశేషం. అంటే చంద్రబాబు ఆదేశాన్ని చివరకు లోకేష్ తోడల్లుడు కూడా లెక్క చేయలేదన్న విషయం అర్ధమైపోతోంది.

 

జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న ఆదేశాలను తమ్ముళ్ళలో చాలామంది లెక్క చేయటం లేదు. ఎందుకంటే మొన్నటిమొన్న శ్రీకాకుళం జిల్లాలో ఇదే ప్రయత్నం చేస్తే బెడిసికొట్టింది.  చంద్రబాబు ఆదేశాల ప్రకారం మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని తీర్మానం చేయలంటే నేతలు ఎదురుతిరిగారు. రాజధాని విషయంలో జగన్ ప్రతిపాదనకే తమ మద్దతుంటుందని స్పష్టం చేశారు. దాంతో ఏమీ చేయలేక చివరకు సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.

 

అంటే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో రెండు జిల్లాల్లోని మెజారిటి టిడిపి నేతలు రాజధాని విషయంలో జగన్ కే మద్దతని తేలిపోయింది.  ఇక మిగిలిన విజయనగరం జిల్లా నేతల సమావేశం ఎప్పుడో చూడాలి. అలాగే మిగిలిన 10 జిల్లాల నేతల సమావేశాలు ఎప్పుడు పెట్టుకుంటారు ?  ఎటువంటి చర్చలు జరుగుతాయి ? ఏ విధంగా తీర్మానాలు చేస్తారు ? అనే విషయాలు ఆసక్తిగా మారింది. జరుగుతున్నది చూస్తుంటే  చంద్రబాబు మాటకు పార్టీలోనే విలువ లేదన్న విషయం తెలిసిపోతోంది. పార్టీలో క్లారిటి వచ్చేసిన తర్వాత ఇక బయట వ్యవహారాలు ఎలా చక్కబెడుతారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: