పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశాన్ని కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నార్సీతోపాటు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారి కొందరు మరణించిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఇదే స‌మ‌యంలో, జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలు గురించి పార్లమెంట్‌ లేదా క్యాబినెట్‌లో ఎప్పుడూ చర్చించలేదని స్పష్టం చేశారు. ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడిన ప్రధాని, సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అసోంలో మాత్రమే అమలు చేశామని వెల్లడించారు. 

 


అయితే, మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రం ఈ కామెంట్లపై ఘాటుగా స్పందించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్నామని  తెలిపారు. సీఏఏను ఉపసంహరించుకోవాలని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ మతతత్వ విధానం దేశాన్ని అస్థిరతకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. స్వార్థ పూరిత ఆలోచనలను కేంద్రం మానుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్సార్సీ)పై చర్చించనే లేదని ప్రధాని మోదీ అంటారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నార్సీని అమలు చేస్తామని చెబుతున్నారని, ఎవరి మాట నిజమని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. 

 

ఇదిలాఉండ‌గా, సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల కొనసాగుతున్న నిరసనలకు మద్దతు తెలుపుతున్నట్టు 70కి పైగా విద్యార్థి, యువజన సంఘాలు మంగళవారం ఢిల్లీలో ప్రకటించాయి. నూతన సంవత్సరం రోజున నేషనల్‌ యంగ్‌ ఇండియా కో-ఆర్డినేషన్‌ అండ్‌ క్యాంపేయిన్‌(వైఐఎన్‌సీసీ)తో పాటు మరికొన్ని మద్దతు సంఘాలతో రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తామని విద్యార్థి నాయకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: