ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలలోని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జగనన్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితా దాదాపుగా ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50.91 లక్షల మంది జగనన్న అమ్మఒడి పథకానికి అర్హులుగా ఎంపికయ్యారు. వైసీపీ ప్రభుత్వం 2020 జనవరి నెల 9వ తేదీన 50.91 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలో 15,000 రూపాయలు జమ చేయనుంది. 
 
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నా ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి తల్లి ఆధారంగా ఖాతాలలో చెల్లింపులు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 70.41 లక్షలుగా ఉన్నారు. అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల వివరాలు విద్యార్థులు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆన్ లైన్ లో నమోదు చేశారు. 
 
విద్యార్థి, విద్యార్థి తల్లి ఆధార్ కార్డుల జిరాక్స్, విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతా జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ లను గ్రామ, వార్డ్ వాలంటీర్లు సేకరించి వివరాలను పరిశీలించారు. నివేదికలను రేషన్ కార్డు ఉన్నవారు ఒక నివేదిక, రేషన్ కార్డు లేని వారిని మరొక నివేదిక, రేషన్ కార్డు ఉండి ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఉన్న వారి వివరాలను మరో నివేదికలో రూపొందించారు. దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నట్టు తేలటంతో గ్రామ వాలంటీర్లు వీరి వివరాలను పరిశీలించారు. 
 
ఈ 8 లక్షల మందిలో గ్రామ, వార్డు వాలంటీర్ల పరిశీలన తరువాత 65,000 మంది లబ్ధిదారులుగా తేలినట్టు సమాచారం. అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితా గ్రామసభల ఆమోదం పొందిన తరువాత పాఠశాల విద్యాశాఖకు పంపించారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎస్‌ఎస్‌) కు లబ్ధిదారుల వివరాలను జత చేసి అమ్మఒడి లబ్ధిదారులు 50.91 లక్షలు ఉన్నట్టుగా గుర్తించారు. 2020 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: