ఆర్టీసీ బస్సుల చార్జీలు పెంచడమే కానీ తగ్గించడం అనే మాట ఉండదు కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం  హైదరాబాద్ నగర ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా  నడుస్తున్న మెట్రో లగ్జరీ ఏసీ బస్సు్ల్లో ఛార్జీలను మాత్రం తగ్గిస్తున్నారు . అయితే, ఇటీవలే ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఈ నేపథ్యంలో, మెట్రో లగ్జరీ ధరలను తగ్గిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

అయితే టికెట్ ధరలను ఎంతవరకు  తగ్గించాలి అనే  విషయంలో ఇప్పటికే అధికారులు కసరత్తు కూడా పూర్తి చేసి, ఆమోదం కోసం ఇన్‌చార్జీ ఎండీ సునీల్‌శర్మకు పంపారు. ఇక ఆయన ఆమోద ముద్ర వేయగానే తగ్గించిన బస్సు  ఛార్జీలు అమలు చేస్తారు  అయితే, ఎప్పటి నుంచి  ఈ ఛార్జీలు అమలు అవుతాయి అనే విషయంఫై స్పష్టత లేకపోయినా, జనవరి 1 సిటీ ప్రయాణికులకు కొత్త ఛార్జీలు  అమలులోకి రానున్నాయి అని అభిప్రాయపడుతున్నారు .

 

మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రస్తుతం ఎల్‌బీ నగర్‌ నుంచి లింగంపల్లికి టికెట్‌ రూ.110 ఉంది. అదే దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి అయితే రూ.80 వసూలు చేస్తున్నారు. మెట్రో రైలు ఛార్జీతో పోలిస్తే ఈ చార్జీలు  చాలా ఎక్కువ. దీంతో ఎక్కువ మంది మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల మెట్రో లగ్జరీ బస్సుల్లో జనాలు ఎక్కడం  తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న రూ.110 ధరను రూ.75కి, రూ.80గా ఉన్న ఛార్జీని రూ.50కి తగ్గించనున్నట్లు సమాచారం. కనీస టికెట్‌ ధర రూ.20ను అలాగే కొనసాగిస్తూ, మూడు స్టాప్‌ల తర్వాత ఛార్జీలను సవరించనున్నట్లు సమాచారం.

 

ఈ మార్పుతో మెట్రో డీలక్స్ బస్సుల కంటే.. రూ.ఐదో, రూ.పదో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులు ఈ బస్సుల వైపు మళ్లే అవకాశం ఉంటుందనేది ఆర్టీసీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం నగరంలో మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు 80 తిరుగుతున్నాయి. ఆటోమేటిక్ డోర్లు, సౌకర్యవంతమైన సీట్లు, సీసీ కెమెరాలు ఉండడం ఈ బస్సుల మరో  ప్రత్యేకత. 

మరింత సమాచారం తెలుసుకోండి: