దేశవ్యాప్తంగా రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. చట్టాల్లో మార్పులు తెస్తున్నా, నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా అత్యాచారాల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. కొన్నిరోజుల క్రితం దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆత్మరక్షణ కోసం దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయం కూడా విదితమే. 
 
దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ తరువాత అత్యాచారాల సంఖ్య తగ్గుతుందని భావించినా అత్యాచార ఘటనలు, గ్యాంగ్ రేప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన మరవకముందే మరో గ్యాంగ్ రేప్ వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలోని మాడ్గులపల్లి మండలం గుండ్రవానిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక బహిర్భూమి కోసం బయటకు వెళ్లిన సమయంలో ఇద్దరు యువకులు ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
బాధిత బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. బాలిక కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేశారు. న్యాయంగా తీర్పు చెప్పాల్సిన గ్రామ పెద్దలు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయటంతో పాటు నిందితులకే వత్తాసు పలకడం గమనార్హం. గ్రామ పెద్దలు నిందితుల దగ్గరనుండి కొంత మొత్తం డబ్బు తీసుకొని ఆ డబ్బులను బాధిత బాలిక కుటుంబానికి ఇచ్చి వారి కుటుంబాన్ని ఆ ఊరి నుండి పంపించివేశారు. 
 
కానీ గ్రామంలో ఈ విషయం తెలిసిన కొందరి ద్వారా విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు గ్రామప్రజలను ఈ విషయం గురించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న గ్రామ పెద్దలను కూడా విచారిస్తున్నారు. గ్రామంలోని కొందరు బాధిత బాలిక కుటుంబాన్ని గ్రామ పెద్దలు బెదిరించి పంపించారని చెబుతున్నారు. గ్రామస్తులు నిందితులతో పాటు గ్రామ పెద్దలను కూడా శిక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: