ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కావలిలో కావలి రూరల్ పోలీసులు 500 రూపాయల నోట్లకు 2,000 రూపాయల నోట్లు ఇస్తామంటూ మోసం చేసిన గ్యాంగ్ ఆట కట్టించారు. డీఎస్పీ ప్రసాద్ డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గ్యాంగ్ వివరాలను వెల్లడించారు. గోసుల సుబ్బారెడ్డికి ఉల్లిగడ్డల రాజేష్ అనే వ్యక్తి మోదీ త్వరలో 2 వేల రూపాయల నోట్లను రద్దు చేస్తాడని తమకు 500 రూపాయల నోట్లు ఇస్తే 25 శాతం అదనంగా 2000 రూపాయల నోట్లు ఇస్తామంటూ ఆశ చూపాడు. 
 
మా వద్ద అధికంగా 2000 రూపాయల నోట్లు ఉన్నాయని అందువలన సహాయం చేయాలని ఉల్లిగడ్డల రాజేష్ అనే వ్యక్తి సుబ్బారెడ్డిని కోరాడు. రాజేష్ మాటలు నమ్మిన సుబ్బారెడ్డి మొదట రాజేష్ కు లక్ష రూపాయల 500 నోట్లు ఇచ్చాడు. వెంటనే రాజేష్ సుబ్బారెడ్డికి 1,24,000 రూపాయల 2,000 రూపాయల నోట్లు ఇచ్చాడు. ఆ తరువాత రాజేష్ సుబ్బారెడ్డితో 30 లక్షల రూపాయలు తీసుకొనివస్తే 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాడు. 
 
సుబ్బారెడ్డి అతని మిత్రులతో కలిసి మొదట 10లక్షల రూపాయల ఐదు వందల నోట్లు రాజేష్ కు ఇచ్చాడు. రాజేష్ మాత్రం 30 లక్షల రూపాయలు ఒకేసారి ఇస్తేనే 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ తరువాత సుబ్బారెడ్డి మరో 5 లక్షల రూపాయల ఐదు వందల నోట్లు సురేష్ కు ఇచ్చాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా డబ్బులు రాజేష్ గ్యాంగ్ ఇవ్వకపోవటంతో సుబ్బారెడ్డి మోసపోయినట్లు గ్రహించాడు. 
 
సుబ్బారెడ్డి వెంటనే కావలి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రాజేష్, నాయబ్, శ్రీకాంత్ లను అరెస్ట్ చేసి 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూతధారి నాగరాజు అనే వ్యక్తి అని అతని దగ్గర నుండి డబ్బును స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇలాంటి మోసాలు చేసే గ్యాంగులు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: