ఏపీ సీఎం జగన్ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. జగన్ క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వారన్న సంగతి తెలిసిందే. సొంత జిల్లా కడప పర్యటనలో ఉన్న జగన్.. పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక పార్థనలు నిర్వహించారు. అనంతరం సీఎం వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్‌ భారతి ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఈ సందర్భంగా వైయస్‌ విజయమ్మ ఉద్వేగ పూరితంగా కొద్దిసేపు ప్రసంగించారు. దేవుడి దయ, ప్రజలందరి ఆశీర్వాదంతో ఆనాడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని, ఆయన మరణించినా కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉన్నారన్నారు. అంతే ప్రేమతో వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకున్నారని, దేవుడు జగన్‌ బాబు మీద చాలా గొప్ప బాధ్యత పెట్టాడన్నారు.

 

ప్రతి నిత్యం జనం.. జనం అంటూ జనం కోసమే వైయస్‌ జగన్‌ ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, ఆళ్ల నాని, మంత్రులు అవంతి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను వైయస్‌ విజయమ్మ, సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు.

 

మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లోనూ జగన్ పాల్గొన్నారు. ‘అందరికీ మెర్రీ క్రిస్మస్‌...’ అంటూ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం కొవ్వొత్తుల ప్రదర్శనకు సారథ్యం వహించి క్రిస్మస్‌ కేకును కట్‌ చేశారు. ప్రార్థనా గీతాల నడుమ బిషప్‌లు, పాస్టర్ల సందేశాలతో రెండు గంటలకుపైగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ క్లుప్తంగా తన సందేశాన్ని ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: