ప్ర‌ముఖ క్రికెట‌ర్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నవంబర్‌ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఉద్ధవ్‌ కావడం విశేషం. ఈ నేప‌థ్యంలో భారత లెజండరీ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌ కలిశారు. ఉద్ధవ్‌ ఆహ్వానం మేరకు వీరిద్దరూ సబర్బన్‌ బాంద్రాలోని ఆయన నివాసం మాతోశ్రీలో మర్యాదపూర్వకంగా కలిశారు.  అయితే, ఇది జ‌రిగిన కొద్దిసేప‌టికే స‌చిన్‌కు షాక్ త‌గిలింది. 

 

ఈ స‌మావేశం జ‌రిగిన కొద్ది సేప‌టికే, ప్ర‌ముఖ క్రికెట‌ర్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు భ‌ద్ర‌త విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స‌చిన్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్స్ క్యాట‌గిరీ సెక్యూర్టీ క‌ల్పించారు. ఇక నుంచి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌కు ఆ భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించ‌నున్నారు. ఎక్స్ క్యాట‌గిరీ కింద స‌చిన్ వెంట 24 గంట‌లు పోలీస్ కానిస్టేబుల్ ఉండేవారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్‌ ఉండ‌డు. కానీ స‌చిన్‌కు మాత్రం ఎస్కార్ట్ ఉంటుంది. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌ముఖుల‌కు భ‌ద్ర‌త‌ను మార్చేయ‌డంలో భాగంగా మాజీ క్రికెట‌ర్ స‌చిన్‌కు భ‌ద్ర‌త‌ను కుదిస్తూ ఉద్ద‌వ్ ఠాక్రే స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. అయితే, ఈ నిర్ణ‌యం సీఎంను క‌లిసిన కొద్ది సేప‌టికే వెలువ‌డటం స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

ఇదిలాఉండ‌గా,  శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే త‌న‌యుడైన‌ శివ‌సేన ఎమ్మెల్యే ఆదిత్య థాక‌రే భ‌ద్ర‌త‌ను పెంచారు. వై క్యాట‌గిరీ నుంచి జెడ్ క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఆయ‌నకు క‌ల్పించ‌నున్నారు. బీజేపీ నేత ఏక్‌నాథ్ ఖ‌డ్సేకు ఉన్న వై క్యాట‌గిరీ భ‌ద్ర‌త‌ను తొల‌గించారు. ఇక ఆయ‌న‌కు ఎస్కార్ట్ ఉండ‌రు. మాజీ బీజేపీ నేత‌, యూపీ గ‌వ‌ర్న‌ర్ రామ్ నాయ‌క్ సెక్యూర్టీని కూడా జెడ్ క్యాట‌గిరీ నుంచి ఎక్స్ క్యాట‌గిరీకి త‌గ్గించారు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ ఉజ్వ‌ల్ నిక్క‌మ్ సెక్యూర్టీని వై క్యాట‌గిరీ నుంచి జెడ్ క్యాట‌గిరీకి త‌గ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: