ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని టీడీపీ వాదిస్తుంటే.. అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రం జపిస్తూనే... జగన్‌వి పిల్ల చేష్టలుగా కొట్టిపారేస్తున్నారు బీజేపీ నేతలు.  

 

మూడు రాజధానులు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సెగలు రేపుతోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు విసురుకుంటున్నారు. ఓవైపు అమరాతి రైతులు ఆందోళనలు చేస్తుండగా.. మరోవైపు విపక్షాలన్నీ ఎల్లుండి నుంచి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. ఈ తరుణంలో అధికార, విపక్ష నేతలు రాజధాని వ్యవహారంపై మాటల యుద్ధాన్ని ఉధృతం చేశారు.  

 

సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో అభివృద్ధి సాధ్యం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. అమరావతిని కాదని, విశాఖలో రాజధాని  పెట్టాలనే ఆలోచన సరైంది కాదని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.  అమరావతి ప్రాంత రైతులను టీడీపీ నేతలు మళ్లీ మోసం చేస్తున్నారని విమర్శించారు. విశాఖను తానే అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబు... శిలాఫలకాలు ఎవరు వేశారో చూసేందుకు వస్తారా అని నిలదీశారు బొత్స. 

 

వైజాగ్ లో ఉన్న వైసీపీ నేతల భూముల కోసమే జగన్ ప్రభుత్వం.. పరిపాలనా రాజధాని నిర్ణయం తీసుకుందని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైజాగ్ లో క్రిస్టియన్ ప్రాపర్టీ కొట్టేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.  ఐదేళ్లలో పదకొండు వేల ఎకరాల కొనుగోళ్లు జరిగితే.. ఈ ఏడునెలల్లో 20 వేల ఎకరాల కొనుగోళ్లు జరిగాయన్నారు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధానిగా పెట్టినా బెజవాడలో ఏం అభివృద్ధి చెందిందో చెప్పాలంటూ అటు వైసీపీ నేతలు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. అమరావతిని చంపేస్తున్నారంటూ.. రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  అమరావతి రైతులు రాజధాని కావాలని అడగలేదని.. అప్పటి ప్రభుత్వం అడిగితే భూములను స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారని చెప్పారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు కొందరు తమ స్వప్రయోజనాలకోసమే చేస్తున్నారని ఆరోపించారు స్పీకర్ తమ్మినేని.  వైజాగ్‌, కర్నూలుకు రాజధానిని విస్తరిస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరి వింతగా ఉందన్నారు బీజేపీ నేతలు. కక్ష సాధించేందుకే రాజధానిని జగన్ మార్చుతున్నారని  మండిపడ్డారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని మారుతుందనే భావన ప్రజల్లో ఏర్పడిందన్నారు. 

 

మొత్తం మీద.. మూడు ప్రధాన పార్టీల నేతలు.. రాజధానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. రోజురోజుకుగా ఈ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: