హైకోర్టును కర్నూలుకు తరలించాలి. విశాఖ, అమరావతిల్లో బెంచ్ ఏర్పాటు చేయాలి. ఇదీ జీఎన్ రావు కమిటీ సిఫార్సు. ఇక ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే హైకోర్టు తరలింపు అనేది అనుకున్నంత సులువుగా ఉంటుందా..? కేంద్రం నుంచి ఆమోదం లభిస్తుందా..? ఇప్పటికే అమరావతిలోనే హైకోర్టు అంటూ రాష్ట్రపతి గెజిట్‌ కూడా జారీ చేసేశాక.. మళ్లీ మార్పునకు సుప్రీం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. 

 

రాజధాని తరలింపు వ్యవహరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అగ్గి రాజేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడమే కాకుండా.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నెల 27న జరిగే కెబినెట్‌ భేటీలో జీఎన్ రావు కమిటీ సిఫార్సులపై చర్చించడం.. వాటిని ఆమోదించడం వంటివి చకచకా కానిచ్చేసి తరలింపు ప్రక్రియ కూడా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఉగాది తర్వాత నుంచి విశాఖ కేంద్రంగా రాజధాని కార్యకలాపాలు సాగించేందుకు కావాల్సిన గ్రౌండ్‌ను ప్రిపేర్‌ చేసుకున్నట్టే కన్పిస్తోంది. ఈ క్రమంలో సెక్రటేరియేట్‌ తరలింపు విషయంలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనా.. వాటిని ఎదుర్కొవడానికి కావాల్సిన కట్టుదిట్టమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే సిద్దం చేసుకున్నట్టు కన్పిస్తోంది.  

 

అయితే సెక్రటేరీయేట్‌ తరలించే విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కావు కానీ.. హైకోర్టు తరలింపు విషయంలో మాత్రం సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ నుంచి హైకోర్టు తరలింపు.. అమరావతి కేంద్రంగానే హైకోర్టు ఉంటుందని స్పష్టం చేస్తూ ఈ ఏడాది మొదట్లోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. కేంద్ర ఆమోదం.. సుప్రీం అంగీకారం తర్వాత రాష్ట్రపతి రాజముద్ర వేశారు. ఈ క్రమంలో హైకోర్టును తిరిగి కర్నూలుకు తరలించాలంటే మళ్లీ ఈ ప్రాసెస్‌ అంతా చేయాల్సి ఉంటుంది. ఇక అమరావతి, విశాఖల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం ఎంత వరకు సానుకూలంగా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. 

 

ఈ మొత్తం ఎపిసోడ్ పై కేంద్రం ఆలోచన ఏ విధంగా ఉంటుంది..? సుప్రీం కొలిజీయం ఏ అభిప్రాయంతో ఉందనేది ఆసక్తిగా మారింది. అయితే కొందరు న్యాయ నిపుణులు మాత్రం హైకోర్టు తరలింపు అనుకున్నంత ఈజీ కాదనే భావనతో ఉన్నట్టు తెలుస్తోంది. తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు అంత సానుకూల వాతావరణం కన్పించడం లేదనే చర్చ  జరుగుతోంది.  హైకోర్టు తరలింపే కష్టసాధ్యమనుకుంటున్న ఈ తరుణంలో బెంచ్‌ల ఏర్పాటు ఎంత వరకు సాధ్యమవుతుందని విశ్లేషిస్తున్నారు న్యాయ నిపుణులు. మరోవైపు అమరావతి నుంచి హైకోర్టును తరలించవద్దంటూ ఆందోళనలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు అడ్వకేట్లు. సుప్రీం కోర్టు తరలింపు విషయంలో ఈ చర్చలు.. వారి భావనలు ఏ విధంగా ఉన్నా.. కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: