ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కిపోతున్నాయి. రాజధాని విషయంలో ప్రభుత్వానికి అమరావతి ప్రాంత రైతులకూ ఓ యుద్ధమే జరుగుతోంది. జీఎన్ రావు కమిటీపై, రాజధాని అంశంపై వారం రోజులుగా రైతులు ధర్నాలు, నిరసనలూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయమై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. దీనిపై ఈనెల 27న జరుగబోయే కేబినెట్ మీటింగ్ పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులకు నోటీసులు జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా మారింది.

 

 

రాజధాని ప్రాంత గ్రామమైన మందడం రైతులకు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న రైతుల నివాసాల్లో కొత్త వ్యక్తులు ఉండకూడదంటూ నోటీసుల్లో తెలిపారు. కొత్త వ్యక్తులు ఉంటే వెంటనే తమకు తెలియచేయాలంటూ డీఎస్పీ రైతులకు స్పష్టం చేశారు. ఈనెల 27న మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో రైతులకు నోటీసులిచ్చామని.. ఆ రోజు సీఎం, మంత్రులు వెళ్లే మార్గంలో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్లుండి మంత్రిమండలి భేటీ జరుగనున్న నేపథ్యంలో మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రోడ్డు పక్కనున్న ఇళ్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంత్రిమండలి భేటీ జరిగే రోజున నిరసనలు చేసేందుకు అనుమతి లేదని కూడా పోలీసులు తెలిపారు.

 

 

ఇప్పటికే పరిస్థితులు రాజకీయంగా కూడా మారిపోయాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. పోలీసుల నోటీసులపై మందడం గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసులకు భయపడేది లేదంటున్నారు మందడం గ్రామస్తులు. రాజధాని విషయంలో రేపు అఖిలపక్ష భేటీ కూడా జరుగనుంది. మొత్తానికి రైతుల నిరసనలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, మంత్రిమండలి భేటీ.. వెరసి రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: