శివసేన అధినేత, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక‌రే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌లే మ‌హారాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న రైతుల‌కు రుణ‌మాఫీ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే రుణాల‌ను మాఫీ చేయ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర సీఎం తెలిపారు. డ‌బ్బును నేరుగా రైతు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌నున్నారు. 2 ల‌క్ష‌ల లోపు రుణం తీసుకున్న రైతుల‌కు ఈ మాఫీ వ‌ర్తిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా సుమారు 30 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు రుణం బ‌కాయి ఉన్న రైతుల‌కు ఈ స్కీమ్ ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌హాత్మ జ్యోతిబా పూలే రైతు రుణ‌మాఫీ స్కీమ్‌ను మార్చి నెల నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు సీఎం ఉద్ద‌వ్ చెప్పారు. రుణ‌మాఫీ కోసం సుమారు 21 వేల 216 కోట్లు కేటాయించారు. 

 

నవంబర్‌ 28న శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి వ్యక్తి ఉద్ధవ్‌ కావడం విశేషం. సేన నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన మూడో వ్యక్తి ఠాక్రేనే. రాజకీయాలతో మతాన్ని కలిపివేయడం, 25 ఏళ్లు బీజేపీతో కలిసి ముందుకు సాగడం తమ పార్టీ చేసిన పొరపాటని  మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అంగీకరించారు. సిద్ధాంతాలను వదిలి కాంగ్రెస్‌, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకున్నారన్న మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యాఖ్యలను ఉద్ధవ్‌ తిప్పికొట్టారు. ఇటీవల ముగిసిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్‌ ప్రతిస్పందిస్తూ.. ‘మీరు (ఫడ్నవీస్‌) ప్రజాతీర్పు గురించి మాట్లాడుతున్నారు. మేం మతాన్ని మార్చుకోలేదు. నిన్న, నేడు, రేపు మేం హిందువులమే. మీరు విభిన్న సిద్ధాంతాలు గల పార్టీలతో పొత్తెలా పెట్టుకున్నారు?’ అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: