పులివెందుల.. ఏపీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం..ఇప్పుడు దీనికి మహర్దశ పట్టబోతోంది. పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలు రూపొందుతున్నాయి. అవేంటో చూద్దామా.. పులివెందులలో వైయస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, రూ.347 కోట్లతో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ నిర్మించబోతున్నారు. గాలేరు – నగరి సృజల స్రవంతి ప్రధాన కాల్వ నుంచి వేముల, వేంపల్లి మండలంలోని 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడతారు. ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి నీరు అందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర్లో ఉన్న చెరువులు వీ.కొత్తపల్లి, గిడ్డంగులవారిపల్లి, టి.వెలమారిపల్లి, ముచ్చుకోన చెరువుల ద్వారా నీరు వెళ్లి పాపాగ్ని చెరువులో కలుస్తాయి. ఈ ప్రాజెక్టుకు రూ. 58 కోట్లతో శంకుస్థాపన చేశారు.

 

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎర్రబెల్లి చెరువుకు నీటిని నింపడం, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌తో ప్రభావితం అయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడతారు. గిడ్డంగులవారిపల్లెలో 1.01 టీఎంసీ రిజర్వాయర్‌ కూడా నిర్మిస్తున్నారు. దీని వల్ల యూసీఐఎల్‌ పల్లెలకు నీరు పూర్తిగా అందుతుంది. దీని కోసం అక్షరాల రూ.350 కోట్లతో శంకుస్థాపన చేశారు.

 

పులివెందల మున్సిపాలిటీలో 57.36 కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ కోసం అక్షరాల రూ.100 కోట్లు కేటాయించారు. పులివెందుల మున్సిపాలిటీలో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్స్‌ ఏర్పాటు కోసం రూ.65 కోట్ల కేటాయిస్తూ శంకుస్థాపన చేశారు. వేంపల్లి గ్రామ పంచాయతీ నందు 86.50 కిలోమీటర్ల మేరకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ ఏర్పాటు చేయబోతున్నారు. దీని కోసం వేంపల్లి టౌన్‌కు రూ.63 కోట్లు కేటాయింపు చేస్తూ శంకుస్థాపన చేశారు.

 

పాడా నిధులతో పులివెందుల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం, సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ పనులు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, పీబీసీ, సీబీఆర్‌ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, పీబీసీ నుంచి దొరలవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనంబావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయినీ చెరువు నుంచి బక్కనగారిపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కింద రామట్లపల్లె చెరువు, గునకలపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపరెడ్డిపల్లె, అమ్మాయిగారిపల్లి కుంటకు నీరు అందించడానికి మొత్తం ఇవన్నీ కలిపి రూ.114 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఇలా మొత్తం దాదాపు వెయ్యి కోట్లకు పైగా పనులకు శంకుస్థాపనలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: