తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆర్టీసీ ఉద్యోగుల‌కు తీపిక‌బురు వినిపించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై తెలంగాణ‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. 

 

మ‌రోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం విష‌యంలో సైతం సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించారు. తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇడిలు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. బోర్డు కూర్పుకు సంబంధించి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 

ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డులో భాగంగా ప్రతీ డిపో నుంచి, ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు మొత్తం 202 మంది బోర్డులో సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బిసిలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలు ఉంటారు. మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉంటారు. బోర్డు సమావేశం డిపో పరిధిలో వారానికి ఒకసారి, రీజియన్ పరిధిలో నెలకు ఒకసారి, కార్పొరేషన్ పరిధిలో మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను పరిష్కరిస్తారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: