అమరావతిలో "ఇన్సైడర్ ట్రేడింగ్" జరిగింది అంటున్న వైయస్ఆర్సిపి ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని తెలుగు దేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. చంద్రబాబు అమరావతి ప్రాంతంలోని పలు గ్రామాలను సందర్శించి, ఆంధ్రప్రదేశ్‌ కు మూడు రాజధానులు ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా నిరసనలు చేస్తున్న రైతులకు తన మద్దతును తెలిపారు.

 

చంద్రబాబు మాట్లాడుతూ “అమరావతిలో రాజధానిని నిర్మించడానికి తగినంత డబ్బు లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ వారు నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తే, అది జీఎస్టీతో అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. మేము ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డామని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అది నిజమైతే, వారు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలి. ఎవరైనా దోషులుగా తేలితే వారిని శిక్షించండి. మేము కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాము." అని సవాల్ విసిరారు చంద్రబాబు.

 

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన తరువాత, అమరావతి రైతులు గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు అమరావతి పై వైస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అమరావతికి రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారు వారికి ఇచ్చిన హామీలు కూడా ముఖ్యమైనవి, వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని బాబు పేర్కొన్నారు. "మేము విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా ప్రకటించాము మరియు దానిని ఐటి హబ్ గా అభివృద్ధి చేసాము" అని ఆయన చెప్పారు.

 

రైతుల నిరసనపై స్పందిస్తూ మునిసిపల్ వ్యవహారాల శాఖా మంత్రి బోత్స సత్యనారాయణ మాట్లాడుతూ “రాబోయే కేబినెట్ సమావేశంలో మూడు రాజధానులు ఉండాలన్న నిపుణుల ప్యానెల్ నివేదికను ప్రభుత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.” అని పేర్కొన్నారు. ఈ నెల 27న రాజధానిపై క్యాబినెట్ మీటింగులో ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: